సీఎంకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్షాలే చేశాయేమో?

4 Jan, 2021 04:59 IST|Sakshi

రామతీర్థంలో విగ్రహాల ధ్వంసంపై సినీ హీరో సుమన్‌

దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వినతి

తిరుమల: రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేవాలయాల పరిరక్షణకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సినీ హీరో సుమన్‌ కోరారు. ఆదివారం తిరుమలలోని ఓ అతిథిగృహంలో ఆయన మాట్లాడుతూ రామతీర్థం ఘటనలో విగ్రహాలను ఎవరు ధ్వంసం చేశారో నిర్ధారణకు రాకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు. ముఖ్యమంత్రికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రతిపక్ష నాయకులే విగ్రహాలు ధ్వంసం చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా నిందితులను గుర్తించడకుండా ఒకరిమీద మరొకరు నిందలు వేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారు దేవుని చేతిలో తప్పకుండా శిక్షను అనుభవిస్తారని చెప్పారు. సీసీ కెమెరాలతో ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. 

ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది: మంత్రి చెల్లుబోయిన
రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసే అవకాశం లేకపోవడంతో టీడీపీ నాయకులు దైవ నిందలకు పాల్పడుతున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దైవ అపచారాల్లో కుట్రకోణముందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసులో నిందితులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు