సమ్మర్‌ యాపిల్‌.. గిరాకీ సూపర్‌!

9 May, 2022 13:41 IST|Sakshi

ప్రకాశం (కొనకనమిట్ల) : సమ్మర్‌ యాపిల్‌గా పేరొందిన తాటి ముంజల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు, హనుమంతునిపాడు, జె.పంగులూరు, కొత్తపట్నం మండలం ఈతముక్కల తదితర ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న తాటి తోపులు వందలాది కుటుంబాలకు ఉపాధినిస్తున్నాయి. కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు, బ్రాహ్మణపల్లి, నాయుడుపేట, చినమనగుండం, వింజవర్తిపాడు, దాసరపల్లి, సలనూతల, మర్రిపాలెం తదితర గ్రామాలకు చెందినవారు తాటి ముంజలు సేకరిస్తూ హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. గొట్లగట్టు కేంద్రంగా సుమారు 300 కుటుంబాలు ఉపాధి పొందుతుండగా, బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రతి కుటుంబం తాటి ముంజలు సేకరించి విక్రయించడం విశేషం. ఈ గ్రామంలో 14 ఏళ్లలోపు పిల్లలు కూడా హుషారుగా తాటి చెట్లు ఎక్కి అవలీలగా కాయలు దించేయడంలో దిట్టలు.  


కాయల నుంచి ముంజలు తీస్తూ..

మూడు నెలలే ఉపాధి  
తాటి ముంజల సేకరణ చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే అలవాటైన పని కావడం, తగిన జాగ్రత్తలు తీసుకుంటుండటంతో పెద్దగా ఇబ్బందేమీ లేదని ముంజల సేకరించేవారు చెబుతున్నారు. వేసవిలో మూడు నెలలపాటు సాగే తాటి ముంజల వ్యాపారంలో ఒక్కో కుటుంబం నెలకు రమారమీ రూ.40 వేలు సంపాదిస్తోంది. తెల్లవారుజామునే తాటి తోపులకు వెళ్లి కాయలు సేకరించడం.. గ్రామాల్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం ముంజల వ్యాపారుల దినచర్య. ప్రస్తుతం వీరంతా హోల్‌సేల్‌గా కాయలు విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు.


   గొట్లగట్టు బస్టాండ్‌లో ముంజల వ్యాపారం
 

 కొందరు చిరు వ్యాపారులు మాత్రం ముంజలు తీసి వినియోగదారులకు అమ్ముతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, పోరుమామిళ్ల, మార్కాపురం, ఒంగోలు, కొమరోలు, గిద్దలూరు, దొనకొండ ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు గొట్లగట్టు పరిసర ప్రాంతాల్లో ముంజలు హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నారు. కడప జిల్లా నుంచి 20 మంది వ్యాపారులు గొట్లగట్టు నుంచి ముంజలు తీసుకెళ్లి పోరుమామిళ్ల, బద్వేలు, మైదుకూరులో విక్రయిస్తున్నారు.కరోనా నేపథ్యంలో రెండేళ్ల నుంచి తాటి ముంజల వ్యాపారం ఆటోలు, మోటార్‌ సైకిళ్లపైనే సాగుతోంది. 

తాటి చెట్టుకు విరగకాసిన కాయలు 

ఉపయోగాలివే.. 
 వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా దాహార్తి తీరక త్వరగా అలసిపోయేవారు తాటి ముంజలు తినడం ద్వారా చలాకీగా ఉంటారు.  
 ఎక్కువగా ఎండలో తిరిగేవారు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ముంజలు ఎంతగానో ఉపకరిస్తాయి. 
 అజీర్తి సమస్యతో బాధపడేవారు లేత ముంజలు తింటే ఎసిడిటీ దూరమవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  
 తాటిముంజల్లో ఏ, బీ, సీ విటమిన్లతో పాటు జింక్, పొటాషియం లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి.  
 ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి.  

మరిన్ని వార్తలు