దంచికొడుతున్న ఎండలు, అయితే ఇవి మంచికే!

2 Apr, 2021 13:12 IST|Sakshi

వీటితో నైరుతి రుతుపవనాలు సానుకూలం

సమృద్ధిగా వర్షాలు కురుస్తాయంటున్న నిపుణులు

‘పసిఫిక్‌’లో అనుకూలంగా ‘లానినా’ పరిస్థితులు 

సాక్షి, అమరావతి: మండుటెండలు మంచికే అంటున్నారు వాతావరణ నిపుణులు. నిప్పులు కురిసే ఎండలు, వడగాడ్పుల వల్ల మంచి ఏమిటనే సందేహం తలెత్తడం సహజం. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉంటూ వడగాడ్పులు వీచిన సంవత్సరంలో వచ్చే నైరుతి రుతుపవనాలు ఎంతో సానుకూలంగా ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు. అందుకే వేసవి తాపం వల్ల జనం అవస్థలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత వచ్చే నైరుతి రుతుపవనాల సీజనుకు ముందస్తుగా వచ్చే ఎండలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు.

మరోవైపు ఏటా పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా, ఎల్‌నినో పరిస్థితులేర్పడుతుంటాయి. లానినా పరిస్థితులుంటే ఆ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటూ నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉండడానికి  దోహదపడతాయి. అలాగే ఎల్‌నినో పరిస్థితులేర్పడితే ఆ సంవత్సరం వేసవి తాపం అంతగా కనిపించదు. కానీ వర్షాలు సమృద్ధిగా కురవక కరువుకు దారితీస్తుంది. ప్రస్తుతం పసిఫిక్‌ మహా సముద్రంలో మోస్తరు లానినా పరిస్థితులున్నాయి. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. ఇలా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడేందుకు దోహదపడతాయి.

ప్రస్తుతం మార్చి మూడో వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. సాధారణంకంటే 4–7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలుచోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. వేసవి ఆరంభానికి ముందే అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని హడలెత్తిస్తున్నాయి. మరోవైపు ఈ ఏప్రిల్, మే నెలల్లో ఉత్తర, వాయవ్య, తూర్పు మధ్య భారతదేశంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ తాజా నివేదికలో తెలిపింది. అదే సమయంలో అక్కడితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఒకింత తక్కువగా రికార్డవుతాయని పేర్కొంది. ఉత్తర, వాయవ్య, మధ్య భారతదేశంలో ఉష్ణతీవ్రత ప్రభావం మన రాష్ట్రంపై కూడా ఉంటుందని వాతావరణశాఖ రిటైర్డ్‌ అధికారి ఆర్‌.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. అటునుంచి వీచే వేడి, పొడి గాలుల వల్ల ఇక్కడ కూడా ఉష్ణతాపం పెరుగుతుందన్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదైన ఏడాది వచ్చే నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించడంతో పాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. అందువల్ల ఈ సీజనులో అధిక ఉష్ణోగ్రతలు నైరుతి రుతుపవనాలకు సానుకూలమని తెలిపారు

ఎండ, వడగాలులతో అట్టుడుకుతున్న రాష్ట్రం
సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం/మంగళగిరి: రాష్ట్రంలో ఎండ ప్రచండరూపం దాల్చింది. ఉదయం నుంచే భానుడు భగభగలాడుతున్నాడు. వడగాలులు పెరిగాయి. గురువారం రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. మన రాష్ట్రంలోని 50 ప్రాంతాల్లో ఇదేమాదిరిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 78 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీయగా 197 మండలాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం జిల్లాలోని కొనకమిట్ల, కందుకూరుల్లో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండురోజుల్లో వడగాలులు మరింత అధికంగా ఉంటాయని అమరావతి వాతావరణ పరిశోధన కేంద్రం సంచాలకురాలు స్టెల్లా చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఆవరణలోని వాతావరణ పరిశోధన కేంద్రంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

శుక్ర, శనివారాల్లో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. ఉభయగోదావరి, నెల్లూరు, రాయలసీమల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వడగాడ్పులు, రాయలసీమలో రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందన్నారు. 1953 మార్చి 29న విజయవాడలో 43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైందని, అనంతరం ఇన్ని సంవత్సరాల తర్వాత మార్చి 31వ తేదీ బుధవారం 43.3 డిగ్రీల రెండో అత్యధిక ఉష్ణోగ్రత  నమోదైందని చెప్పారు. రానున్న రెండు రోజుల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగు జాగ్రత్తలు తీసుకుని వడదెబ్బ నుంచి రక్షణ పొందాలని సూచించారు.

రెండు రోజులు వర్ష సూచన
దక్షిణ అండమాన్‌ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం ఉదయం బలపడి.. తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇది తదుపరి 24 గంటల్లో బలపడి ఉత్తర అండమాన్‌ సముద్రం, పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా మారే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. దీనికి తోడు.. ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి జార్ఖండ్‌ నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ నెల శని, ఆదివారాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశాలుయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి రానున్న రెండు రోజులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు