హైకోర్టుకు వేసవి సెలవులు

8 May, 2022 03:29 IST|Sakshi

రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

జూన్‌ 13న తిరిగి ప్రారంభం

సాక్షి, అమరావతి: హైకోర్టుకు సోమవారం (9వ తేదీ) నుంచి జూన్‌ 10వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి జూన్‌ 13న ప్రారంభమవుతాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఆదేశాల మేరకు సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్‌ కోర్టులు ఏర్పాటయ్యాయి. వెకేషన్‌ కోర్టుల్లో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు, బెయిల్, ముందస్తు బెయిల్‌ పిటిషన్లు, సెలవులు పూర్తయ్యేంత వరకు వేచి చూడలేని అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టంచేసింది.

మొదటి దశ వెకేషన్‌ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్‌ కె.మన్మథరావు, జస్టిస్‌ తర్లాడ రాజశేఖర్, జస్టిస్‌ చీమలపాటి రవి ఉంటారు. ఇందులో జస్టిస్‌ మన్మథరావు, జస్టిస్‌ రాజశేఖర్‌ ధర్మాసనంలో, జస్టిస్‌ చీమలపాటి రవి సింగిల్‌ జడ్జిగా కేసులను విచారిస్తారు. రెండో వెకేషన్‌ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉంటారు. ఇందులో జస్టిస్‌ దుర్గా ప్రసాదరావు, జస్టిస్‌ కృష్ణమోహన్‌లు ధర్మాసనంలో, జస్టిస్‌ వెంకటేశ్వర్లు సింగిల్‌ జడ్జిగా కేసులను విచారిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఏవీ రవీంద్రబాబు నోటిఫికేషన్‌ జారీ చేశారు.    

మరిన్ని వార్తలు