హైకోర్టుకు వేసవి సెలవులు

14 May, 2023 05:08 IST|Sakshi

15 నుంచి జూన్‌ 12 వరకు

అత్యవసర కేసుల విచారణకు వెకేషన్‌ కోర్టుల ఏర్పాటు 

సాక్షి, అమరావతి: హైకోర్టుకు ఈనెల 15 నుంచి జూన్‌ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి జూన్‌ 13న ప్రారంభమ­వుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్‌ కోర్టులు ఏర్పాటయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటుచేశారు. రెండు దశల్లో ఈ వెకేషన్‌ కోర్టులు పనిచేస్తాయి. హైబ్రిడ్‌ (భౌతిక, ఆన్‌లైన్‌) విధానంలో కేసులను విచారిస్తారు. మొదటి దశ వెకేషన్‌ కోర్టులు మే 16 నుంచి 26 వరకు పనిచేస్తాయి. రెండో దశ కోర్టులు మే 27 నుంచి జూన్‌ 12 వరకు పనిచేస్తాయి.

ఈ వెకేషన్‌ కోర్టుల్లో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు, బెయిల్, ముందస్తు బెయిల్‌ పిటిషన్లు, సెలవులు పూర్తయ్యేంత వరకు వేచిచూడలేనటువంటి అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే, సర్వీసు సంబంధిత కేసులు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ చట్టానికి సంబంధించిన కేసులను అత్యవసరం అయితే తప్ప విచారించబోమని పేర్కొంది. అలాగే, సీఆర్‌పీసీ సెక్షన్‌ 482, అధికరణ 226 కింద ఎఫ్‌ఐఆర్‌లు, చార్జిషీట్లను కొట్టేయాలంటూ దాఖలుచేసే వ్యాజ్యాలను ఈ వేసవి సెలవుల్లో విచారించబోమని తెలిపింది.  

వెకేషన్‌ కోర్టుల్లో జడ్జిలు వీరే.. 
ఇక మొదటి దశ వెకేషన్‌ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్‌ బీఎస్‌ భానుమతి, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు, జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ఉంటారు. ఇందులో జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ రవీంద్రబాబు ధర్మాసనంలో.. జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌ సింగిల్‌ జడ్జిగా కేసులను విచారిస్తారు. మొదటి వెకేషన్‌ కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయాలనుకునే వారు మే 16వ తేదీన దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తులు మే 18న విచారణ జరుపుతారు. అలాగే, మే 30న వ్యాజ్యాలు దాఖలు చేస్తే జూన్‌ 1న విచారణ ఉంటుంది.

జూన్‌ 6న పిటిషన్లు దాఖలు చేస్తే వాటిపై న్యాయమూర్తులు జూన్‌ 8న విచారణ జరుపుతారు. రెండో వెకేషన్‌ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్‌ దుప్పల వెంకటరమణ, జస్టిస్‌ వి.గోపాలకృష్ణరావు ఉంటారు. ఇందులో జస్టిస్‌ కృష్ణమోహన్, జస్టిస్‌ గోపాలకృష్ణరావు ధర్మాసనంలో.. జస్టిస్‌ దుప్పల వెంకటరమణ సింగిల్‌ జడ్జిగా కేసులను విచారిస్తారు. జూన్‌ 8న విచారణ జరిపే ధర్మాసనానికి న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య నేతృత్వం వహిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వై. లక్ష్మణరావు నోటిఫికేషన్‌ జారీచేశారు. 

మరిన్ని వార్తలు