ఎండలు బాబోయ్‌ ఎండలు.. అలా చేస్తే వాహనాలు పేలే ప్రమాదం

5 May, 2022 18:12 IST|Sakshi

సాక్షి,ఆమదాలవలస(శ్రీకాకుళం): భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ అనధికార కర్ఫ్యూ విధిస్తున్నాడు. ఎండల్లో బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు. గొడుగులు, టోపీలు లేనిదే అడుగు బయట పెట్టడం లేదు. సూరీడు నిప్పులు కక్కుతున్న వేళ ప్రజలతో పాటు వాహనాలకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాహనాలు ఎండలో గంటల సమయం ఉంచడం వల్ల రంగు వెలిసి పోతాయని, పెట్రోల్‌ ఆవిరయ్యే  అవకాశం ఉందని చెబుతున్నారు. వాహనాలకు ట్యాంక్‌ నిండా పెట్రోల్‌ పోస్తే ఒక్కోసారి పేలే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. 

రక్షణ ఇలా.. 
►వాహనాలు ఎక్కువ సేపు   పార్కింగ్‌ చేయాల్సి వస్తే చెట్టు నీడన గానీ, షెడ్లలో గానీ లేదా కవర్లు కప్పి గానీ ఉంచాలి. 
►అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్లలో గాలి తగ్గిపోతుంది.
►బైక్‌ ఎక్కువ సమయం ఎండలో ఉంచితే పెట్రోల్‌ ఆవిరి అయిపోయే అవకాశం ఉంటుంది.
► ఎండ వేడికి ఇంజిన్‌ ఆయిల్‌ కూడా త్వరగా పల్చబడిపోతుంది. నిర్ణీత  సమయానికి ఇంజిన్‌ ఆయిల్‌ మార్చుకోవడం మంచిది.
►వేసవిలో పెట్రోల్‌ ట్యాంకులో గ్యాస్‌ ఏర్పడే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో బైక్‌ను పార్క్‌ చేసినప్పుడు ఒకసారి ట్యాంకు మూతను తెరిచి మూయాలి.
►వేసవిలో ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణం చేయడం తగ్గించుకుంటే మేలు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే కొంతదూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంజిన్‌ కాసేపు ఆపుకుంటే వాహనం మన్నిక కాలం పెరుగుతుంది. నిర్ణీత గడువు లోపు ఇంజిన్‌ ఆయిల్‌ చెక్‌ చేసుకోవాలి.  

కార్ల విషయంలో.. 
►  కార్లు, లారీలు ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీళ్లు తరచూ తనిఖీ చేయించుకోవాలి. 
►  రేడియేటర్లలో నీళ్ల కంటే కూఎంట్‌ ఆయిల్‌ వాడడం మంచిది.  
►  పెట్రోల్, డీజిల్‌ తోపాటు ఎల్‌పీజీ గ్యాస్‌ ద్వారా వాహనాలు నడిపేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అలాంటి వాహనదారులు వేసవిలో గ్యాస్‌ కిట్‌ను ఉపయోగించకుండా ఉంటే ఉత్తమం. 
►  ఏసీ నిలబడాలంటే కారు అద్దాలకు క్లాత్‌మ్యాట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

చదవండి: వైరల్‌ వీడియో: పాపం.. మృత్యువు ఇలా వస్తుందని ఊహించి ఉండరు

మరిన్ని వార్తలు