ఎండలు ‘మండే’న్‌ 

3 May, 2022 03:20 IST|Sakshi

అత్యధికంగా ఇబ్రహీంపట్నంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు 

కంచికచర్ల, చందర్లపాడులో 44 డిగ్రీలు.. అనేక చోట్ల 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు 

514 మండలాల్లో వేడి గాలులు  

సాక్షి, అమరావతి: భానుడి భగభగలు  నిప్పుల కొలిమిని తలపించాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సోమవారం 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా చందర్లపాడు, కంచికచర్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా నందలూరు, పెనగలూరు, చిట్వేల్, ప్రకాశం జిల్లా దోర్నాలలో 43.4 డిగ్రీలు, కర్నూలు జిల్లా కల్లూరు, వెల్దుర్తి, నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి అర్బన్‌లో 43.1 డిగ్రీలు, కర్నూలు, కృష్ణా జిల్లా తిరువూరు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పుల్లల చెరువు, ముండ్లమూరులో 43 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, రాజమండ్రి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 42.9 డిగ్రీలు, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో 42.8, కర్నూలు జిల్లా పాణ్యం, బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 42.6, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రకాశం జిల్లా తర్లపాడులో 42.5, చిత్తూరు జిల్లా చిత్తూరు, గుడిపలలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

152 మండలాల్లో తీవ్రమైన వేడి
రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా.. 514 మండలాల్లో సోమవారం బాగా వేడి వాతావరణం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 152 మండలాల్లో మాత్రం తీవ్రమైన వేడి గాలులు ఉన్నట్లు పేర్కొంది. నెల్లూరు, వైఎస్సార్, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఎండ వేడి, ఉక్కపోత వాతావరణంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంగళ, బుధవారాలు కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీలోనూ అక్కడక్కడా జల్లులు పడ్డాయి.

వడదెబ్బకు ఇద్దరు మృతి
నారాయణవనం (తిరుపతి): తిరుపతి జిల్లా నారాయణవనంలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. స్థానిక కోమటి బజారువీధికి చెందిన దొరస్వామి కుమారుడు ప్రేమ్‌(12) ఆదివారం వడదెబ్బ బారినపడి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. అరుణానది సమీపంలోని డంపింగ్‌ యార్డు వద్ద ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను సేకరిస్తున్న పళనిస్వామి (47) వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించాడు. 

మరిన్ని వార్తలు