ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌

18 Jun, 2021 18:19 IST|Sakshi

వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ 

సాక్షి, అమరావతి: ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు ఆదివారం వ్యాక్సినేషన్ డ్రైవ్‌ చేపడుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్‌ వేవ్‌పై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ నెలాఖరుకు 12 వేల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 10 వేల డి టైప్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఏపీలో 113 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు ఫైనల్‌ చేశామని పేర్కొన్నారు. థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో 6151 ఆక్సిజన్, ఐసీయూ బెడ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని సింఘాల్ తెలిపారు.

రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని సింఘాల్‌ తెలిపారు. ఈనెల 21 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇచ్చామని.. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉధృతి నేపథ్యంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 400 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 70 శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నామని సింఘాల్‌ వెల్లడించారు.

చదవండి: ఏపీలో కొత్తగా 6,341 కరోనా కేసులు
Covid Time: నేస్తమా.. నువ్వచట కుశలమా..! 

మరిన్ని వార్తలు