సాగుకు సమయమిదే 

16 Jun, 2022 23:46 IST|Sakshi
చింతపల్లిలో పొద్దు తిరుగుడు పంట సాగు     

పొద్దు తిరుగుడు సాగుతో లాభాలు 

అధిక దిగుబడులు ఇస్తున్న మోర్డాను రకం 

చింతపల్లి: మన్యంలో గిరిజన రైతులు పొద్దు తిరుగుడును సాగు చేసేందుకు ఇదే సరైన సమయమని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌  డాక్టర్‌ అనురాధ తెలిపారు. ఆరోగ్యవంతమైన  నూనె పంటల్లో పొద్దుతిరుగుడు ప్రధానమైనది. వార్నిష్, సబ్బుల తయారీలో కూడా పొద్దుతిరుగుడును వినియోగిస్తారు. అన్నిరకాల భూముల్లో ఈ పంటను సాగుచేయవచ్చు.

ఏజెన్సీ ప్రాంతానికి మోర్డారు రకం అత్యంత అనుకూలంగా ఉన్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌ రెండవ వారు నుంచి ఆగస్టు రెండవ వారం వరకు సాగుకు అనుకూల వాతావరణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏడీఆర్‌  డాక్టర్‌ అనురాధ అందించిన వివరాలు..  

సాగు పద్దతి  
పొద్దు తిరుగుడు సాగుకు  ముందుగా భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని మెత్తగా తయారు చేయాలి. హెక్టారుకు 12 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాలను ఒకటిన్నర అంగుళాల లోతులో నాగలి చాళ్లలో వేసుకోవాలి. అంతకన్నా లోతులో వేసుకుంటే మొలక సరిగా రాదు. చాళ్ల మధ్య దూరము 2 అడుగులు, మొక్కల మధ్య 12 అంగుళాల దూరం వేసుకోవాలి.

హెక్టారుకు 60 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్‌ ఇచ్చే ఎరువులను వేయాలి. పొద్దు తిరుగుడును వేరుశనగలో మిశ్రమ పంటగా 8 నుంచి 12 వరసలకు రెండేసి వరుసల చొప్పున వేసుకోవాలి. భాస్వరం, పొటాష్‌ ఎరువులను ఆఖరి దుక్కిలోను, నత్రజని ఎరువులో సగం విత్తుకునేటప్పుడు, మిగిలింది పంట మొగ్గ మీద ఉన్నప్పుడు వేసేకోవాలి. విత్తిన నెల రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. వేరుశనగలో మిశ్రమ పంటగా వేస్తే వరుసలు తూర్పు, పడమర దిక్కున వేయాలి. లేకుంటే పొద్దుతిరుగుడు వరుసల నీడ వేరుశనగపై పడి పంటకు నష్టం జరుగుతుంది.

ఈ పంటకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు నిలువ ఉండకూడదు. ఈ పంట పరస్పరాగ సంపర్కము మూలంగా గింజకడుతంది. పంట పూత దశలో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య పువ్వు మీద చేతితో గాని, మెత్తని గుడ్డతో గాని సున్నితంగా రుద్దినట్లయితే పరాగ సంపర్కము బాగుండి గింజ బాగా కట్టి దిగుబడి పెరుగుతుంది. సాధారణంగా క్రిమి కీటకాలు, తెగుళ్లు ఆశించవు.

పచ్చగొంగళి పురుగు ఆశించినట్లయితే దీని నివారణకు 35 ఈసీ మందు రెండు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.  పంట చివరి దశలో పిట్టల భారీ నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలి. వర్షాధార పంటగా ఎకరాకు ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి పెరుగుతుంది. పొద్దుతిరుగుడు సాగుతో గిరిజనులు మంచి లాభాలు పొందవచ్చని ఏడీఆర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు