తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి

21 May, 2023 08:18 IST|Sakshi

జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు తాజాగా యత్నం

వివేకా హంతకుడు దస్తగిరి బెయిల్‌ రద్దు పిటిషన్‌ను వ్యతిరేకించిన సునీత 

వాస్తవాలు వెల్లడించకుండా కట్టడి చేసేందుకే సునీత తాపత్రయం 

తన భర్త, బావ పాత్ర బయటపడకుండా ఉంచాలన్నదే లక్ష్యం

సాక్షి, అమరావతి: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత తీరు మరోసారి వివాదాస్పదమైంది. తండ్రిని హత్యచేసిన వారికి శిక్షలు పడేందుకు పోరాడుతున్నానని చెబుతున్న ఆమె వ్యవహారశైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటం అనేకానేక సందేహాలు లేవనెత్తుతోంది. వివేకాను హత్యచేశానని స్వయంగా ఒప్పుకున్న దస్తగిరికి ఆమె పూర్తి అండదండలు అందిస్తుండటం తెలిసిందే.

మరోవైపు.. వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో కలిసేందుకు సునీత శుక్రవారం ప్రయత్నించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దస్తగిరి బెయిల్‌ వ్యవహారంలో సునీత వ్యవహారశైలి.. అనంతరం ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు ఆమె యత్నించడానికి సంబంధం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.

తన తండ్రి హత్య కేసులో ప్రధాన నిందితులను ప్రభావితం చేయడం ద్వారా ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఆమె యత్నిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. అసలు వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఆయన హత్యకు దారితీసి ఉండొచ్చన్న బలమైన ఆరోపణలకు సునీత ప్రస్తుత వ్యవహారశైలి బలం చేకూరుస్తోంది.

హంతకుడు దస్తగిరికి సునీత అండదండలు..
సాధారణంగా తండ్రిని హత్యచేసిన వారిపై ఎవరికైనా ఆగ్రహం ఉంటుంది. కానీ, వైఎస్‌ వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేశానని ఒప్పుకున్న దస్తగిరిపై ఆయన కుమార్తె సునీత అంతులేని సానుకూలత ప్రదర్శిస్తున్నారు. సీబీఐ దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడాన్ని ఆమె ఏమాత్రం వ్యతిరేకించలేదు. అనంతరం.. బెయిల్‌ కోసం దస్తగిరి పిటిషన్‌ వేస్తే సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేయలేదు. అంతేకాదు.. సునీత కూడా అతని బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించలేదు. మరోవైపు.. అసలు హత్యచేసిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడాన్ని వివేకా పీఏ కృష్ణారెడ్డి న్యాయస్థానంలో సవాల్‌ చేశారు.

అతనికి ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని కూడా కోర్టును కోరారు. కానీ, సునీత వెంటనే ఈ కేసులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయడం విస్మయపరిచింది. అలాగే, దస్తగిరి బెయిల్‌ను రద్దుచేయాల్సిన అవసరంలేదని ఆమె న్యాయస్థానికి తెలపడం గమనార్హం. అంతేకాదు.. ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డికి ఎలాంటి అర్హతలేదని.. బాధితురాలిగా తనకే అది ఉందని ఆమె వాదించారు. దస్తగిరి బెయిల్‌పై బయట ఉండటంపట్ల తనకేమాత్రం అభ్యంతరంలేదని చెప్పుకొచ్చారు. అసలు తన తండ్రిని హత్యచేసిన వ్యక్తి జైలులో ఉండాలని కోరుకోవాల్సిన సునీత.. అతను బయట ఉండాలని ఆశిస్తుండటం వెనుక ఏదో మతలబు ఉందన్నది స్పష్టమవుతోంది.

దస్తగిరి వాంగ్మూలాన్ని బలపర్చాలనే.. 
నిజానికి.. దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలతో ఎర్ర గంగిరెడ్డి విభేదించారు. సీబీఐ నమోదు చేసిన దస్తగిరి అప్రూవర్‌ వాంగ్మూలంలో చెప్పినవన్నీ అవాస్తవాలని ఆయన చెప్పారు. దాంతో దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలం అంతా కట్టుకథేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో.. ఎర్ర గంగిరెడ్డిని కలిసి దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను బలపరచాలని ఒత్తిడి చేయడమే సునీత ఉద్దేశంగా తెలుస్తోంది.

అందుకోసం ఎర్ర గంగిరెడ్డిని ప్రలోభాలకు గురిచేయడం.. ఆయన బెయిల్‌కు సీబీఐ సహకరించేట్లుగా చేస్తానని హామీ ఇవ్వడం ఆమె ప్రణాళికగా ఉంది. వివేకా హత్య అనంతరం అక్కడ ఆధారాలను ధ్వంసం చేయాలని ఎర్ర గంగిరెడ్డిని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి  ఆదేశించారు. ఇదే అంశం సునీత, ఆమె భర్తకు ప్రతికూలంగా మారింది. ఈ విషయంలో మాట మార్చాలని.. ఆధారాల ధ్వంసంతో తన భర్తకు సంబంధంలేదని ఎర్ర గంగిరెడ్డితో చెప్పించాలన్నది సునీత ఉద్దేశం. తాను చెప్పినట్లు చేస్తే ఎర్ర గంగిరెడ్డికి బెయిల్‌ వచ్చేందుకు సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చేందుకు యత్నించినట్లు తెలిసింది.

ఎర్ర గంగిరెడ్డిని కలిసే ప్రయత్నం ఎందుకో!?
ఇక వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని జైల్లో కలిసేందుకు సునీత ప్రయత్నించడం ఇప్పుడు విస్మయపరుస్తోంది. గంగిరెడ్డిని కలిసేందుకు ఆమె జైలు అధికారులను అనుమతి కోరగా వారు నిరాకరించారు. దాంతో ఆమె తన న్యాయవాది ద్వారా కొన్ని పత్రాలు ఆయన వద్దకు పంపి సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. అసలు తన తండ్రి హత్యకేసులో ఏ–1గా ఉన్న గంగిరెడ్డిని సునీత కలిసేందుకు యతి్నంచడం సందేహాస్పదంగా మారింది. సుప్రీంకోర్టు బెయిల్‌ రద్దుచేయడంతో ఎర్ర గంగిరెడ్డి పోలీసుల ముందు లొంగిపోయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. తాను చెప్పినట్లుగా చెబితే దస్తగిరికి సహకరించినట్లుగానే ఎర్ర గంగిరెడ్డికి సహకరిస్తామని ఆయనకు చెప్పేందుకే సునీత ప్రయత్నించినట్లు  సమాచారం.

వేళ్లన్నీ సునీత, ఆమె భర్తవైపే..
ఈ మొత్తం పరిణామాలతో వివేకా హత్యకేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు సునీత ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టమైంది. ఆమె ఎందుకు హంతకులకు కొమ్ముకాస్తూ మరీ హత్య కేసు దర్యాప్తు దారి మళ్లించేందుకు యత్నిస్తున్నారన్నది కీలక ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తలెత్తాయన్నది బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో.. వివేకా హత్యకు గురికావడంతో ఆయన సొంత కుటుంబ సభ్యులపై సందేహాలు వ్యక్తమయ్యాయి.
చదవండి: ఏది నిజం?: గంతలు కట్టేందుకే కట్టుకథలు

వివేకా హత్య తరువాత ఆయన రాసిన లేఖ, సెల్‌ఫోన్లను పోలీసులకు వెంటనే ఇవ్వకుండా గోప్యంగా ఉంచమని పీఏ కృష్ణారెడ్డితో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఇదే అంశంపై సీబీఐ ఇటీవల వారిని విచారించింది కూడా. నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే వివేకా హత్య స్థలంలో ఆధారాల ధ్వంసం చేశారన్నది వెల్లడైంది కూడా. వివేకా రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ నేత బీటెక్‌ రవి, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డితో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావగారు శివప్రకాశ్‌రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారన్నది కూడా బహిరంగ రహస్యంగా మారింది.  

వాస్తవాలు వెల్లడి కాకూడదనే.. 
ఈ నేపథ్యంలో.. వివేకా హత్య కేసులో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డిల పాత్ర ఉందనే వాదన బలపడుతోంది. అంటే ఈ కేసులో వారిని నిందితులుగానే భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తాము బాధితులమని.. తమకే అర్హత ఉందని చెప్పేందుకు వారు నైతిక హక్కు కోల్పోయారు. మరోవైపు.. ఎర్ర గంగిరెడ్డి సీబీఐ ముందు నిజాలు వెల్లడిస్తే తమ కుటుంబానికి ఇబ్బందిగా మారుతుందని సునీత ఆందోళన చెందుతున్నారు. అందుకే వాస్తవాలు వెల్లడించకుండా కట్టడి చేసేందుకే ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు సునీత యత్నించినట్లు స్పష్టమవుతోంది.   

మరిన్ని వార్తలు