‘సూపర్‌..’ స్పెషాలిటీ వైద్యం

15 Nov, 2020 19:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రధాన విభాగాల్లో అదనంగా యూనిట్లు

తద్వారా ఎక్కువ మంది రోగులకు మెరుగైన సేవలు

పలు వైద్య కళాశాలల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు

యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ వైద్యుల నియామకం

కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించాలని యోచన

క్యాన్సర్‌ చికిత్స ప్రభుత్వ పరిధిలో జరిగేలా చర్యలు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలలకు అనుబంధంగా బోధనాసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో  కొన్ని స్పెషాలిటీల్లో యూనిట్లు పెంచాలని వైద్య విద్యా శాఖ నిర్ణయించింది. యూనిట్ల కొరతతో కొన్ని శస్త్రచికిత్సలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఉంది. యూనిట్లు పెంచితే ఈ సమస్య ఉండదు. ఒక యూనిట్‌లో 10 పడకలతో పాటు ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు వస్తారు. దీంతో ఎమర్జెన్సీ కేసులకు వెంటనే సర్జరీ చేసే అవకాశం ఉంటుంది.

ఆరు విభాగాల్లో యూనిట్లు
ప్రస్తుతం ఆరు విభాగాల్లో అదనంగా యూనిట్లు పెంచాలని నిర్ణయించారు. జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, అనస్థీషియా, పీడియాట్రిక్స్‌ విభాగాల్లో యూనిట్లు పెంచాల్సిన అవసరముందని ఇప్పటికే వైద్య విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆయా బోధనాసుపత్రుల్లో ఇన్‌ పేషెంట్ల సంఖ్య, పని భారాన్ని బట్టి యూనిట్లను నిర్ణయిస్తారు. ప్రధానంగా కింగ్‌జార్జి, గుంటూరు, తిరుపతి రుయా, కర్నూలు, నెల్లూరు, కాకినాడల్లో యూనిట్లు పెంచేందుకు అవకాశం ఉంది.

కొత్త స్పెషాలిటీలూ అవసరమే
ప్రస్తుతం మెజారిటీ ఆస్పత్రుల్లో పలు స్పెషాలిటీల్లో వైద్యులు లేరు. సూపర్‌ స్పెషాలిటీలో అయితే పోస్టులు కూడా మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో ఏడు విభాగాల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని ప్రతిపాదించారు. ఇందులో పీడియాట్రిక్‌ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాలున్నాయి.

ఐదు చోట్ల క్యాన్సర్‌ చికిత్సలు

  • రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా రోజురోజుకూ క్యాన్సర్‌ పేషెంట్లు పెరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఐదు చోట్ల క్యాన్సర్‌ చికిత్సకు ప్రాధాన్యమిచ్చారు. విశాఖపట్నం, కడప, తిరుపతి, కర్నూలు, గుంటూరుల్లో ఈ చికిత్స చేస్తారు. 
  • గుంటూరులో ఇప్పటికే నాట్కో సహకారంతో ఏర్పాటు చేసిన ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కర్నూలులో రూ.120 కోట్లతో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 200 పడకలు ఉంటాయి. 
  • విశాఖపట్నంలో రూ.60 కోట్లతో క్యాన్సర్‌ బ్లాక్‌ ఏర్పాటు చేస్తున్నారు. సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా నిధులు సమకూరుస్తున్నారు. కడపలోనూ క్యాన్సర్‌ చికిత్సకు ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు. 
  • ఇన్నాళ్లూ క్యాన్సర్‌ చికిత్స ప్రభుత్వ పరిధిలో లేకపోవడంతో రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళుతున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ సొమ్ములో ఎక్కువ భాగం ప్రైవేట్‌కే వెళుతోంది. ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్‌ చికిత్స జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
మరిన్ని వార్తలు