సామాన్యులకు ఊపిరి పోస్తున్న జీజీహెచ్‌ ‘సూపర్‌’

5 Nov, 2022 16:20 IST|Sakshi

సర్వజన ఆస్పత్రిలో ‘సూపర్‌ స్పెషాలిటీ’ వైద్యసేవలు

40 బెడ్లతో ప్రత్యేక స్పెషాలిటీ వార్డు

సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓల పర్యవేక్షణలో పనులు

న్యూరో, పీడియాట్రిక్, యూరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీలు అందుబాటులోకి

నెఫ్రాలజీ, న్యూరో ఫిజీషియన్‌ సేవలు సైతం

పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందనున్నాయి. సామాన్యులకు ఊపిరి పోస్తున్న జిల్లా సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా జీజీహెచ్‌ అభివృద్ధికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా న్యూరో, పీడియాట్రిక్, ప్లాస్టిక్, యూరాలజీలకు సంబంధించి సర్జరీ విభాగాలు, నెఫ్రాలజీ, న్యూరో ఫిజీషియన్‌ సేవలు అందించేందుకు రంగం సిద్ధమైంది.  

ఒంగోలు అర్బన్‌:  కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిన ఒంగోలు జీజీహెచ్‌కు నిత్యం పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. అత్యవసర సేవల కోసం పొరుగు జిల్లాల నుంచి కూడా ఇక్కడకు పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. దీంతో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చొరవతో ఆస్పత్రిలో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను సైతం పూర్తి చేసి మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా దీనిని తీర్చిదిద్దేందుకు ఇటీవల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ దినేష్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. జీజీహెచ్‌లో ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించాలని, అందుకు తాను ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని బాలినేని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. 

దీంతో సూపరింటెండెంట్‌ భగవాన్‌ నాయక్, ఆర్‌ఎంఓ చైతన్యవర్మ, ఇతర అధికారులు జీజీహెచ్‌లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. జీజీహెచ్‌ భవనంలోని 112 గదిలో సూపర్‌ స్పెషాలిటీ ఓపీని పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 120లో అత్యాధునిక పరికరాలతో 40 పడకల సూపర్‌ స్పెషాలిటీ వార్డును  సిద్ధం చేయనున్నారు. ఆమేరకు పనులను వడివడిగా నిర్వహిస్తున్నారు. సూపర్‌ స్పెషాలిటీలో న్యూరో, పీడియాట్రిక్, యూరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, సంబంధించిన విభాగాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. అలాగే నెఫ్రాలజీ, న్యూరో ఫిజీషియర్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. 

అభివృద్ధి ఇలా
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీజీహెచ్‌లో అభివృద్ధి చేసిన పనుల్లో కొన్ని రూ.2 కోట్లతో 100 పడకల ఐసీయూ కాంప్లెక్స్, రూ.2 కోట్లతో 100 ఆక్సిజన్‌ బెడ్లతో కోవిడ్‌ ప్రత్యేక గదులు, టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఆడిటోరియం రూ.3.5 కోట్లతో పూర్తి చేశారు. అంతేకాకుండా రూ.7.5 కోట్లతో ఎంఆర్‌ఐ, రూ.2.5 కోట్లతో సిటీ స్కాన్‌ యంత్రాలు ఏర్పాటు చేసి రోగులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి సేవలందిస్తున్నారు. అలాగే రెండు భారీ ఆక్సిజన్‌ ప్లాంట్లు కూడా ఉన్నాయి. 

ప్రజలకు అన్నీ వైద్య సేవలు జీజీహెచ్‌లో అందాలి 
జీజీహెచ్‌లో ప్రజలకు అన్నీ రకాల వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్నీ విభాగాల్లో సర్జరీలు నిర్వహించేలా చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా అందించాల్సిన సేవలను పూర్తి స్థాయిలో నాణ్యంగా అందించేందుకు అన్నీ విధాలుగా సిద్ధం చేస్తున్నాం. సూపర్‌ స్పెషాలిటీ వార్డు ఏర్పాటుతో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలవుతుంది. జీజీహెచ్‌లో వైద్య సేవలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రజలకు మంచి వైద్య సేవలందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం.  
– దినేష్‌ కుమార్, కలెక్టర్‌ 

జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు 
కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జీజీహెచ్‌లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించేందుకు ఆలోచించి ఆ దిశగా చర్యలు చేపట్టాం. త్వరలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసి సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. నిరంతరం సాధారణ ఓపీలను పర్యవేక్షిస్తూ రోగులకు వైద్య సేవలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించేలా చూస్తున్నాం.  
– భగవాన్‌ నాయక్, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ 

మరిన్ని వార్తలు