విద్యుత్‌ ఆదాతో ‘చల్లటి’ వెలుగులు

17 Dec, 2021 04:46 IST|Sakshi
ఇంధన సామర్థ్య ఇళ్ల నిర్మాణ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న అజయ్‌జైన్‌ తదితరులు

జగనన్న కాలనీల్లో ఇళ్లకు బల్బులు, ట్యూబ్‌ లైట్లు, ఫ్యాన్లు సరఫరా

‘ఇండో స్విస్‌ బీప్‌’ టెక్నాలజీతో ఆ ఇళ్లలో తగ్గనున్న ఉష్ణోగ్రత

‘ఎకో–నివాస్‌ సంహిత’ సదస్సులో అజయ్‌ జైన్‌ 

సాక్షి, అమరావతి: పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో విద్యుత్‌ను ఆదా చేసేలా ఇళ్ల నిర్మాణం జరుగుతుందని భవన నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ వెల్లడించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఇండో స్విస్‌– బీప్‌ (బిల్డింగ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్‌), ఆంధ్రప్రదేశ్‌ ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) సంయుక్తంగా ఎకో–నివాస్‌ సంహిత (రెసిడెన్షియల్‌ ఈసీబీసీ కోడ్‌)పై విజయవాడలో గురువారం అవగాహనా సదస్సు జరిగింది. జగనన్న కాలనీల్లో ఇంధన సామర్థ్య ఇళ్ల నిర్మాణ ప్రచార పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు.

అనంతరం అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా తొలి విడత రూ. 28 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇళ్లల్లో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ‘ఇండో స్విస్‌ బీప్‌’ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆ ఇళ్లకు బల్బులు, ట్యూబ్‌ లైట్లు, ఫ్యాన్లు సరఫరా చేస్తామన్నారు. విద్యుత్‌ వినియోగంలో 42 శాతం బిల్డింగ్‌ సెక్టార్‌లోనే జరుగుతున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ తెలిపారు.

ఇండో స్విస్‌ బీప్‌ సాంకేతికత వల్ల బైట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇళ్ల లోపల 3 నుంచి 5 డిగ్రీలు, విద్యుత్‌ వినియోగం 20 శాతం తగ్గుతుందని, వెలుగు ఎక్కువగా ఉంటుందని బీప్‌ ఇండియా డైరెక్టర్‌ సమీర్‌ మైతేల్‌ అన్నారు. ఏపీఎస్‌ఈసీఎం సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్‌ రంగ సంస్థల ప్రతినిధులు, భవన నిర్మాణ రంగ నిపుణులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు