ఎందుకంత ఆందోళన? బాబు లాయర్లతో సుప్రీం బెంచ్‌.. విచారణ వాయిదా

3 Oct, 2023 13:49 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో మాజీ సీఎం చంద్రబాబుకు ఊరట దక్కలేదు. బాబు పిటిషన్‌ ఆధారంగా ఇప్పటికిప్పుడు ఈ అంశాన్ని తేల్చలేమంటూ.. విచారణను వాయిదా వేసింది సుప్రీం. అయితే.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ సందర్భంగా..  వాడీవేడి వాదనలు జరిగాయి.  పీసీ యాక్ట్‌ 17 ఏ చంద్రబాబు కేసులో వర్తిస్తుందా? లేదా? అనే అంశం ప్రధానంగా వాదనలు జరిగాయి. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చంద్రబాబు.. సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. ఎట్టకేలకు ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం వాదనలు వింది.

చంద్రబాబు తరపున సీనియర్‌ లాయర్లు సిద్ధార్థ్‌ లూథ్రా, హరీష్‌సాల్వే, అభిషేక​ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ తరుణంలో.. ఈ పిటిషన్‌పై ఎంత మంది సీనియర్లు వాదిస్తారంటూ బెంచ్‌ పశ్నించగా.. నలుగురం అంటూ తేలికపాటి స్వరంతో సాల్వే బదులిచ్చారు. అయినా మేం ముకుల్‌ రోహత్గీకి(ఏపీ ప్రభుత్వ తరుపున లాయర్‌) సరిపోమని సాల్వే తెలిపారు. అయితే ఇవాళ మాత్రం వాదనలు ముగ్గురే వినిపించారు.

తొలుత.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో నమోదు అయిన అంశాలపైనే హరీష్‌ సాల్వే వాదనలు(వర్చువల్‌)గా వినిపించారు.  ‘‘చంద్రబాబు కేసు పూర్తి రాజకీయపరమైంది. గవర్నర్‌ అనుమతి లేకుండా అరెస్ట్‌ చేశారు.  హైకోర్టు 17ఏ వర్తించదని చెప్పడం సరికాదు. ఈ క్రమంలో.. సెక్షన్‌ 17 ఏ పై హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హరీష్‌ సాల్వే. ఈ సెక్షన్‌ ఎంక్వైరీ తేదీ గురించి చెబుతుంది తప్ప.. నేరం జరిగిన తేదీ గురించి కాదు. సెక్షన్‌ 17 ఏ ప్రకారం చంద్రబాబుకు రక్షణ ఉంటుంది అని సాల్వే వాదనలు వినిపించారు. 

ఇక.. ఇది కేవలం కక్ష సాధింపు చర్యే. 73 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రిని వేధిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నారు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పోలీస్‌ కస్టడీ అడుగుతున్నందునా.. ముందే విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు మరో న్యాయవాది లూథ్రా బెంచ్‌కు తెలిపారు. 

మరో న్యాయవాది మను సింఘ్వీ..  యశ్వంత్‌ సిన్హా కేసు తీర్పును ఉదాహరించారు. ఇది కేవలం మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయమని మాత్రమే అభియోగాలున్నాయని తెలిపారు. అయితే..  ఇప్పుడే కేసు మెరిట్‌లోకి వెళ్లదల్చుకోలేదని బెంచ్‌ తెలిపింది.

ఏకంగా క్వాష్‌ అడుగుతున్నారు
ఇక ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. 17ఏతో ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదు. జులై 2018లో 17-A వచ్చింది. అంతకంటే ముందే ఈ కేసు విచారణ ప్రారంభమైంది ఇందులో రాజకీయ కక్ష లేదు. ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలయింది. అప్పుడే దీన్ని CBI పరిశీలించింది. ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారు? తప్పు చేసింది 2015-16లో. దర్యాప్తు మొదలయింది ఈ ప్రభుత్వం రాకముందే. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారు?

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కేసు విచారణ ప్రారంభమైంది. జీఎస్టీ విభాగం అప్పట్లోనే దర్యాప్తు చేపట్టింది. ఒకసారి ఈ డాక్యుమెంట్లు చూడండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు APSDCని ప్రారంభించారు. కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90% మరో సంస్థ గిఫ్ట్‌గా ఇస్తుందన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయి. అరెస్టయిన మూడు రోజుల్లోనే హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. బెయిల్‌ కోసం ప్రయత్నించకుండా ఇప్పుడు క్వాష్‌ అడుగుతున్నారు. అందుకే  చంద్రబాబు పిటిషన్ ను తిరస్కరించాలి  అని ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. 

ధర్మాసనం వ్యాఖ్యలు
చంద్రబాబు లాయర్లకు పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. బెంచ్‌ పలు ప్రశ్నలు సంధించింది. విచారణ మాత్రమే జరుగుతోందని మీకెందుకు అంత ఆందోళన? అని ప్రశ్నించింది. 2015-16లో  నేరం జరిగింది కదా ? . ఆ లెక్కన 2018లో అవినీతి నిరోధక చట్టంలో 17-a రాకముందే నేరం జరిగింది కదా?. మరోవైపు.. ఐపీసీ కింద నమోదైన నేరాల పరిస్థితి ఏమిటి ?. పీసీ యాక్ట్ తో పాటు ఐపీసీ కింద కూడా నేరాలు నమోదయ్యాయి కదా అని ప్రశ్నించింది. ఈ దశలో రూలింగ్‌ ఇవ్వలేమని.. తర్వాతి విచారణలో వాదనలు వింటామని స్పష్టం చేసింది. 

సుదీర్ఘ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. రెండు వైపులా అఫిడవిట్‌ ఇవ్వాలని, హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ సందర్భంగా ఇచ్చిన అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశిస్తూ..  చంద్రబాబు పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి(9వ తేదీకి) వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు