ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఎస్‌.ఎం.సుభాని

7 May, 2022 08:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది మెహబూబ్‌ సుభాని షేక్‌ (ఎస్‌.ఎం.సుభాని)ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం ఈనెల నాలుగోతేదీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుభాని పేరును కేంద్రానికి పంపింది. ఈ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అదే సమావేశంలో ఢిల్లీ హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదుల్ని, పట్నా హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదుల్ని న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది.

సుప్రీంకోర్టు కొలీజియం ఏడాది కాలంలో వేర్వేరు హైకోర్టులకు 195 మందిని న్యాయమూర్తులుగా నియమించాలని సిఫారసు చేసినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఎస్‌.ఎం.సుభాని పేరును న్యాయమూర్తి పోస్టుకు హైకోర్టు కొలీజియం గత ఏడాది సిఫారసు చేసింది. సుభానితో పాటు మరో ఏడుగురు న్యాయవాదుల పేర్లను కూడా సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సుభాని పేరును పక్కనపెట్టి మిగిలిన ఏడుగురు న్యాయవాదుల పేర్లకు ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు ఆయన పేరును న్యాయమూర్తి పోస్టుకు సిఫారసు చేసింది.  

ఇదీ నేపథ్యం.. 
సుభాని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో జన్మించారు. ఆ గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. ఇంటర్, డిగ్రీ ఆంధ్ర లయోలా కాలేజీలో చదివారు. జేఎన్‌యూ న్యూఢిల్లీలో ఎంఏ పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఏరాసు అయ్యపరెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రభుత్వసంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రస్తుతం హైకోర్టులో ఏసీబీ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా 
పనిచేస్తున్నారు. 

చదవండి: AP: వెయ్యి గ్రామాల్లో పూర్తయిన రీసర్వే

మరిన్ని వార్తలు