కలెక్టరేట్‌ ఎక్కడనే నిర్ణయం ప్రభుత్వానిదే

30 Mar, 2022 16:06 IST|Sakshi

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

బీజేపీ నేత పిటిషన్‌ కొట్టివేత

సాక్షి, ఢిల్లీ: జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలెక్టరేట్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం అభివృద్ధి అడుగుగానే భావించాలని అభిప్రాయపడింది. చిత్తూరు జిల్లా తిరుచానూరులోని పద్మావతి నిలయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్‌గా మార్చాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆధ్యాత్మిక భవనాన్ని కలెక్టరేట్‌కు ఇవ్వడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషనర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు తెలిపారు. ‘కలెక్టర్‌ ఎక్కడ కూర్చోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 

ఈ విషయంలో మేం జోక్యం చేసుకోబోం. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలి కదా. రాష్ట్ర విభజన అయిందంటే కొత్త రాష్ట్రంలో హైకోర్టు ఎక్కడ పెట్టాలి? సెక్రటేరియట్‌ ఎక్కడ నిర్మించాలి అని చూస్తాం కదా? ఆ ప్రాంతంలో ప్రజల నివాసానికి అనుగుణంగా ఉండాలి కదా? దీనికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. పద్మావతి నిలయాన్ని ప్రభుత్వం అద్దె ప్రాతిపదికనే తీసుకుంది. ఉచితంగా ఏం తీసుకోలేదు కదా? కలెక్టర్‌ కార్యాలయం వచ్చిందంటే ఆ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి  చెందుతుంది. కలెక్టర్‌ ఎక్కడ కూర్చోవాలి.. చెట్టు కింద కూర్చొని పనిచేయి అని మేం చెప్పలేం కదా. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలివేయాలి. ప్రజా ప్రయోజనాల అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పులో జోక్యం చేసుకోం. ఈ పిటిషన్‌ కొట్టివేస్తున్నాం..’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.  

చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్‌ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు

>
మరిన్ని వార్తలు