సేల్‌డీడ్‌లో చెప్పినవీ చేయరా? 

15 Jul, 2021 03:32 IST|Sakshi

జయభేరి నిర్మాణసంస్థపై సుప్రీంకోర్టు మండిపాటు 

మురళీమోహన్‌ తదితరుల పిటిషన్‌ కొట్టివేత 

సాక్షి, న్యూఢిల్లీ: సేల్‌డీడ్‌లో చెప్పిన అంశాలు బిల్డర్లు తప్పకుండా పాటించాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. తమపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ కొట్టేయాలంటూ జయభేరి నిర్మాణసంస్థకు చెందిన దుగ్గిరాల కిషోర్, టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్, మాగంటి రామ్మోహన్‌ దాఖలుచేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. సేల్‌డీడ్‌లో రాసింది ఎలా తగ్గిస్తారని, మునిసిపాలిటీకి వదిలేసింది ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించింది.

ఇదీ నేపథ్యం.. 
జయభేరి సిలికాన్‌ కంట్రీ (జేఎస్‌సీ)లోని బీటా కాంప్లెక్స్‌ నివాసి బండ్రెడ్డి మధుసూదన్‌ 2003లో కారు పార్కింగ్‌ సహా 3,010 చదరపు అడుగుల ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. సేల్‌ డీడ్‌లో జయభేరి ప్రాపర్టీస్‌ పలు అంశాలను ప్రస్తావించింది. ‘ప్రధాన రహదారిని ఆనుకుని 7,322 చదరపు అడుగుల ఓపెన్‌ ప్లాట్‌ ఉంది. ఈ స్థలాన్ని 2005లో జేఎస్‌టీ రియాలిటీ లిమిటెడ్‌ గతంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు విక్రయించింది. 2007లో జయభేరి సిలికాన్‌ టవర్స్‌ పేరిట భనవం నిర్మించారు. జేఎస్‌సీలో 18,521 చదరపు అడుగుల్లో ఆల్ఫా, బీటా, గామా టవర్లు నిర్మించారు. ప్లాటు ఉత్తరం వైపు 3,197 చదరపు అడుగుల క్లబ్‌ హౌస్‌ ఉంది. జేఎస్‌సీ ఫ్లాట్‌ యజమానులకు క్లబ్‌హౌస్‌లో ఉచిత ప్రవేశం. ఈ లేఔట్‌ 1999 నాటిది’ అని సేల్‌డీడ్‌లో పేర్కొంది. ఈ సేల్‌డీడ్‌లోని పలు అంశాలు క్షేత్రస్థాయిలో లేవని మధుసూదన్‌ 2008లో గుర్తించారు. ‘7,322 చదరపు అడుగుల ఓపెన్‌ ప్లాటు జయబేరి సిలికాన్‌ టవర్స్‌ (జేఎస్‌టీ) ఆధీనంలోకి వచ్చింది.

సేల్‌డీడ్‌లో డ్రైవ్‌వే 24 అడుగులని పేర్కొనగా 16 అడుగులే ఉంది. మూడు టవర్ల మొత్తం ఏరియా 16,568.045 చదరపు అడుగులే ఉంది. జయభేరి సిలికాన్‌ కంట్రీ యజమానులకు చెందిన సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు (ఎస్‌టీపీ) జయభేరి సిలికాన్‌ టవర్స్‌ పేరిట బదిలీ అయింది. అపార్ట్‌మెంట్‌ యజమానులకు వినియోగహక్కులు మాత్రమే మిగిలాయి’ అని పేర్కొంటూ మధుసూదన్‌ మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు పెట్టారు. పోలీసులు దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మధుసూదన్‌ ట్రయల్‌ కోర్టు, వినియోగదారుల ఫోరం, హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ అథారిటీలను ఆశ్రయించారు. ట్రయల్‌ కోర్టు మురళీమోహన్‌కు అనుకూలంగా డిశ్చార్జి పిటిషన్‌ను అనుమతించింది. దీంతో క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ మధుసూదన్‌ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. సివిల్‌ అంశాలతోపాటు క్రిమినల్‌ చార్జ్‌లు కూడా నమోదు చేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మురళీమోహన్‌ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.   

మరిన్ని వార్తలు