టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు

6 Nov, 2020 03:19 IST|Sakshi

అమరావతి భూకుంభకోణంపై నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలుకు ఆదేశం..

అనంతరం తుది విచారణ కేబినెట్‌ సబ్‌ కమిటీ, సిట్‌ దర్యాప్తు 

నిలిపివేతపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు 

సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూముల కుంభకోణంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ విచారణ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు, దర్యాప్తు ప్రక్రియను నిలువరిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్పీ)పై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా ప్రతివాదులైన టీడీపీ నేతలు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అమరావతి భూ కుంభకోణంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ పరిశీలన మేరకు ఏర్పాటైన సిట్‌ దర్యాప్తును నిలిపివేయాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తదితరులు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా హైకోర్టు దర్యాప్తుపై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. రాష్ట ప్రభుత్వం తరçఫున సీనియర్‌ న్యాయవాదులు దుష్యంత్‌ దవే, శేఖర్‌ నాఫడే, న్యాయవాది మెహ్‌ఫూజ్‌ నజ్కీ వాదనలు వినిపించారు.

దవే వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ హైకోర్టు దర్యాప్తు నిలిపివేస్తూ అసాధారణమైన ఉత్తర్వులు జారీచేసింది. అవకతవకలు జరిగితే వాటిపై దర్యాప్తు జరపొద్దా’.. అని ప్రశ్నించారు. ఈ సమయంలో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ జోక్యం చేసుకుంటూ.. ‘ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపై విచారణ జరపాలనుకుంటుందా?’ అని ప్రశ్నించారు. దీనికి దవే లేదని సమాధానమిచ్చారు. ఇలాంటి సందర్భాల్లో దర్యాప్తు కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు గత ఉత్తర్వులను దవే ప్రస్తావించి ప్రతివాదులకు నోటీసులివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో.. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ ధర్మాసనం ప్రతివాదులైన టీడీపీ నేత వర్ల రామయ్య తదితరులకు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల తర్వాత తుది విచారణ చేపడతామని పేర్కొంది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా