ఎన్జీటీ ఆదేశాలపై స్టే ఇవ్వబోం

9 Jul, 2021 03:50 IST|Sakshi

ఒడిశా ‘పోలవరం ముంపు’ పిటిషన్‌పై సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ముంపునకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తమ వాదనలు వినకుండా ఎన్జీటీ ఏకపక్షంగా ఆదేశాలిచ్చిందని, వాటిని సవాల్‌ చేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సీనియర్‌ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా విచారణ నాలుగు వారాలు వాయిదా వేయాలని ఒడిశా తరఫు న్యాయవాది పవన్‌ భూషణ్‌ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.

తాము నోటీసులు జారీ చేద్దామని భావిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొనగా.. ఎన్జీటీ ఆదేశాలపై స్టే కోరుతూ అప్లికేషన్‌ దాఖలు చేసిన విషయాన్ని భూషణ్‌ ప్రస్తావించారు. ఎన్జీటీ ఆదేశాలపై స్టే ఇవ్వబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రతివాది పొంగులేటి సుధాకర్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది అనితా షెనాయ్, న్యాయవాది శ్రావణ్‌కుమార్‌లు కూడా స్టే ఇవ్వరాదని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రతివాదులైన పి.సుధాకర్‌రెడ్డి, తదితరులకు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఒడిశా దాఖలు చేసిన ఒరిజనల్‌ సూట్‌కు ఈ పిటిషన్‌ను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.  

మరిన్ని వార్తలు