అమరావతి భూముల కేసును కొట్టేసిన సుప్రీం

20 Jul, 2021 04:49 IST|Sakshi

హైకోర్టు తీర్పునకు సమర్థన

సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూముల కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిల ధర్మాసనం సోమవారం సుదీర్ఘంగా విచారించింది. చివరకు పిటిషన్‌లో యోగ్యతలు లేవని కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే తన వాదనలు వినిపిస్తూ.. అధికారిక రహస్యాల ఉల్లంఘనకు సంబంధించిన సెక్షన్‌ 418ను హైకోర్టు విస్మరించిందని తెలిపారు. కొనుగోలుదారులకు భూములు ఎందుకు కొంటున్నారో తెలుసని అమ్మకందారులకు మాత్రం తెలియదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆస్తుల బదిలీ (టీపీ) చట్టం సెక్షన్‌ 55ను ప్రస్తావిస్తూ..  భూమి కొనుగోలు సమయంలో అమ్మకందారుడికి కొనుగోలుదారుడు ఎందుకు కొంటున్నారనే అంశాన్ని వివరించాల్సి ఉందన్నారు.

హైకోర్టు అనేక అంశాలు విస్మరించిందని, నోటీసులు జారీ చేసి విచారణకు అనుమతి ఇవ్వాలని కోరారు. హైకోర్టు ప్రాథమిక దశలోనే దీనిని కొట్టేసిందని వివరించారు. హైకోర్టు తీర్పు ప్రతిని చదువుతూ.. భూములు కొనుగోలు చేయడం రాజ్యాంగ హక్కుగా హైకోర్టు పేర్కొందని, న్యాయమూర్తికి ఓ చీటింగ్‌ కేసులో రాజ్యాంగ హక్కు ఎలా  కనిపించిందో అర్థం కాలేదన్నారు. ప్రైవేటు వ్యక్తుల భూముల కొనుగోళ్లు, అమ్మకాలలో క్రిమినల్‌ చట్టాలు ఎలా వర్తింపజేస్తారని హైకోర్టు ప్రశ్నించిందని, విచారణ చేసినప్పుడే కదా అవన్నీ బయటపడేదని దవే వాదించారు. ఇవన్నీ విస్మరించిన హైకోర్టు ప్రాథమిక దశలోనే కేసును కొట్టేసిందని పేర్కొన్నారు.

రాజధాని ఆ ప్రాంతంలో వస్తుందన్న విషయాన్ని కప్పిపుచ్చి భూములు కొనుగోలు చేశారని ఫిర్యాదుదారుడు ఎస్‌.సురేష్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది పారస్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఓ తెలుగు (సాక్షి కాదు), ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా అమరావతి భూముల స్పెక్యులేషన్‌కు తెరపడిందంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. సీఆర్‌డీఏ కూడా 2014 డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ ఇచ్చిందని పారస్‌ తెలిపారు. ప్రతివాదుల తరఫు సీనియర్‌ న్యాయవాదులు శ్యాం దివాన్, సిద్ధార్థ లూత్రా కూడా వాదనలు వినిపించారు.  వాదనల అనంతరం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది.  

మరిన్ని వార్తలు