ఎన్జీటీ ఉన్నది సామాన్యుల కోసం

1 Jun, 2022 04:40 IST|Sakshi

చట్టసభల సభ్యుల కోసం కాదు 

ఎంపీల లేఖలూ స్వీకరిస్తోందా? 

రిషికొండ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు 

రిషికొండలో ఉల్లంఘనల్లేవని ఎన్జీటీ కమిటీనే నివేదిక ఇచ్చింది

దానిని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకోలేదు : ప్రభుత్వ న్యాయవాది 

ఏపీ వాదనలు వినకుండానే స్టే విధించిందని వెల్లడి 

విచారణ నేటికి వాయిదా  

సాక్షి, న్యూఢిల్లీ: ‘జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఉన్నది న్యాయస్థానాన్ని ఆశ్రయించలేని సామాన్యుల కోసం. చట్టసభ సభ్యులకు కాదు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభ సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేల లేఖలు కూడా ఎన్జీటీ విచారణకు స్వీకరిస్తోందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్జీటీ ప్రొసీడింగ్స్‌ ప్రారంభించడంపై అసహనం వ్యక్తం చేసింది. విశాఖలోని రిషికొండ నిర్మాణాలపై ఎన్జీటీ ఇచ్చిన స్టే ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది.

ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ కమిటీ, కోస్టల్‌ జోన్‌ అథారిటీ, అటవీ శాఖ అనుమతులు వచ్చిన తర్వాతే రిషికొండపై నిర్మాణాలు ప్రారంభించామన్నారు. ప్రతివాది రాసిన లేఖపై ఎన్జీటీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎలాంటి ఉల్లంఘనలు చేయలేదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ దాన్ని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పర్యావరణ అనుమతులు సరైనవా కాదా అనేది పరిశీలించడానికి మరో కమిటీని నియమించిందన్నారు.

ఆ తర్వాత కూడా ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండానే నిర్మాణాలపై ఎన్జీటీ ఏకపక్షంగా స్టే విధించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయని, స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ ప్రతులు అందలేదని, అధ్యయనం చేయడానికి సమయం కావాలని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది కోరడంతో బుధవారం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. రిషికొండ నిర్మాణాలపై హైకోర్టులో తదుపరి విచారణ ఎప్పుడో చెప్పాలని ఏపీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది.   

మరిన్ని వార్తలు