డెయిరీ విభజనపై ఇరు రాష్ట్రాలకు నోటీసులు

1 Jul, 2021 08:04 IST|Sakshi

ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య డెయిరీ ఆస్తుల విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కో–ఆపరేషన్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లను బుధవారం జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్రం ఇచ్చిన మెమో ప్రకారం ఏ ప్రాంతంలోని కార్యాలయాలు, ఆస్తులు ఆ ప్రాంతానికే చెందుతాయని తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది వి.గిరి, న్యాయవాది వెంకట్‌రెడ్డిలు తెలిపారు.

కేంద్రం మెమోకు విరుద్ధంగా హైకోర్టు ఏపీకి సోమాజిగూడలోని కార్యాలయం కేటాయించడం సరికాదన్నారు. డెయిరీకి ప్రధాన కేంద్రంగా ఉన్న లాలాగూడ భవనాలు ఏపీకి కేటాయించాలని ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాది విశ్వనాథన్‌ తెలిపారు. ఈ సమయంలో జస్టిస్‌ రవీంద్రభట్‌ జోక్యం చేసుకొని ఇరు రాష్ట్రాల డెయిరీ విభజనకు ప్రభుత్వాలు చూసుకోవాలని, మధ్యవర్తిత్వాలు ఎందుకని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనల అనంతరం నోటీసులు జారీ చేసిన ధర్మాసనం నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది.
 చదవండి: PV Sindhu: సీఎం జగన్‌కు థ్యాంక్స్‌ చెప్పిన పీవీ సింధు

మరిన్ని వార్తలు