అరకులో న్యాయమూర్తి పెళ్లి వేడుక

2 Jun, 2022 04:44 IST|Sakshi
గిరిజన సంప్రదాయ వస్రాలు ధరించి థింసా నృత్యం చేస్తున్న న్యాయమూర్తి దంపతులు

గిరిజన సంప్రదాయంలో మరోసారి ఒక్కటైన న్యాయమూర్తి దంపతులు

గిరి గ్రామదర్శిని వేదికగా వేడుక నిర్వహించిన గిరిజనులు

అరకులో విహరించిన జస్టిస్‌ ఉదయ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర జడ్జిలు

సాక్షి, పాడేరు (ఏఎస్‌ఆర్‌ జిల్లా): గిరిజన సంప్రదాయంలో ఓ పెళ్లి వేడుక. వరుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి. వధువు ఆయన శ్రీమతి. చుట్టూ న్యాయమూర్తులు. గిరిజనులే పెళ్లి పెద్దలు. చట్టాలను ఔపోసన పట్టి, వేలాది కేసుల్లో ప్రతిభావవంతమైన తీర్పులిచ్చిన న్యాయమూర్తి, ఆయన శ్రీమతి ఆ గిరిజనుల ముందు సిగ్గుమొగ్గలయ్యారు. గిరిజన సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో మెరిసారు. మరోసారి పెళ్లి పీటలెక్కి ఒద్దికగా కూర్చున్నారు.

గిరిజన పూజారులు న్యాయమూర్తి దంపతులకు గిరిజన ఆచారం ప్రకారం మరోసారి వైభవంగా వివాహం చేశారు. అలనాటి వివాహ వేడుకను గురుు తెచ్చుకుంటూ న్యాయమూర్తి మరోసారి తన శ్రీమతికి తాళి కట్టి మురిసిపోయారు. దండలు మార్చుకొని సంబరపడ్డారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని పెదలబుడు గ్రామంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్, అమితా ఉదయ్‌ దంపతుల గిరిజన సంప్రదాయ వివాహ వేడుక అలరించింది.

ఈ వేడుకలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌మిశ్రా, సుచితా మిశ్రా దంపతులు, ఏపీ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ అసానుద్దీన్‌ అమానుల్లాహ్, జీబా అమానుల్లాహ్‌ దంపతులు, రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ సుబ్రమణ్యం శ్రీరామ్, నల్సా డైరెక్టర్‌ పి. శేగల్, పాల్గొన్నారు. వేసవి విడిదిలో భాగంగా జిల్లాలోని అరకు లోయను సుప్రీంకోర్టు న్యాయమూర్తి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు, ఏపీ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ దంపతులు సందర్శించారు.

వారితో పాటు జిల్లా న్యాయమూర్తులు రైలు మార్గంలో అరకు లోయ చేరుకున్నారు. వారికి రైల్వే స్టేషన్లో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్, ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌ స్వాగతం పలికారు. గిరిజన మహిళలు థింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. న్యాయమూర్తులు పెదలబుడు గ్రామంలోని ఐటీడీఏ ఎకో టూరిజం ప్రాజెక్టు గిరి గ్రామదర్శినిని సందర్శించి గ్రామ దేవతలకు పూజలు చేశారు. 

మరిన్ని వార్తలు