ఏపీ హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరణ

13 Sep, 2021 03:46 IST|Sakshi

2015లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని క్లాజ్‌ను కొట్టేసిన హైకోర్టు

దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్ట్‌ 

కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసు

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం ప్రభుత్వం 2015లో జారీచేసిన జీవోలోని క్లాజ్‌ను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ విజయవాడలోగల హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్టు పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం కామన్‌ గుడ్‌ఫంఢ్‌కు ఇచ్చే 9 శాతం నిధుల్లో 2 శాతాన్ని హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్టుకు తప్పనిసరిగా కేటాయించాలనటం ఆంధ్రప్రదేశ్‌ ధార్మిక, హిందూ మతసంస్థలు, దేవదాయ చట్టం–1987లోని సెక్షన్‌ 70కి వ్యతిరేకమని సుప్రీంకోర్టు తెలిపింది.

ఏపీ హైకోర్టు జారీచేసిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్టు దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించిన జస్టిస్‌ ఇందూబెనర్జీ, జస్టిస్‌ జేకే మహేశ్వరిల ధర్మాసనం స్టే ఇవ్వడానికి ఇటీవల నిరాకరించింది. 3 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కామన్‌ గుడ్‌ఫండ్‌కు నిధుల కేటాయింపును ఐదు నుంచి తొమ్మిది శాతానికి పెంచుతూ 2015 అక్టోబర్‌ 1న అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. జీవోలోని క్లాజ్‌ 7(2)(బీ) ప్రకారం హిందూ ధార్మిక కార్యక్రమాల నిమిత్తం తొమ్మిది శాతం నిధుల నుంచి రెండు శాతాన్ని తప్పనిసరిగా కేటాయించాలని పేర్కొంది.

ఈ మొత్తాన్ని మూడునెలలకోసారి ప్రత్యేక ఖాతాలో సదరు ట్రస్టు వద్ద ఉంచాలని పేర్కొంది. 1987 చట్టం సెక్షన్‌ 70 ప్రకారం ఈ జీవో చట్టవిరుద్ధమని విశాఖపట్నానికి చెందిన ఒ.నరేశ్‌కుమార్‌ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హిందు ధార్మిక పరిరక్షణ ట్రస్టు ఏ చట్టబద్ధమైన నిబంధనకు లోబడి ఏర్పాటుకాలేదని, సెక్షన్‌ 70లో పేర్కొన్న ప్రయోజనాల కోసం మాత్రమే ఆ మొత్తాన్ని మళ్లిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, హిందువుల ప్రయోజనాల కోసం ఆ విధంగా మళ్లించడం చట్టవిరుద్ధం కాదని, ఆలయాల తక్షణ మరమ్మతులు, పునర్నిర్మాణాలకు ఆ మొత్తాన్ని వినియోగిస్తారని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు.

వాదనల అనంతరం నాటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సదరు ట్రస్టు చట్టబద్ధమైన సంస్థ కాదని గుర్తించింది. హిందూ ధార్మిక కార్యకలాపాలకు ఇచ్చే కామన్‌ గుడ్‌ఫండ్‌ 9 శాతం నిధుల్లో 2 శాతాన్ని తప్పనిసరిగా ఆ ట్రస్టుకు కేటాయించాలనటం చట్టవిరుద్ధమని పేర్కొంది. జీవోలోని క్లాజ్‌ 7(2)(బీ)ని కొట్టేసింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ధార్మిక పరిరక్షణ ట్రస్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  

మరిన్ని వార్తలు