బాలిక కడుపులో కిలో వెంట్రుకలు 

1 Feb, 2023 04:15 IST|Sakshi
వెంట్రుకల గడ్డను మీడియాకు ప్రదర్శిస్తున్న వైద్యుడు

గుడివాడలో శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యుడు 

గుడివాడటౌన్‌: కృష్ణాజిల్లా గుడివాడలో కడుపునొప్పితో బాధపడుతున్న బాలికకు శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న సుమారు కిలో వెంట్రుకలను తొలగించారు. ఈ శస్త్రచికిత్స వివరాలను డాక్టర్‌ పొట్లూరి వంశీకృష్ణ మంగళవారం మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన బాలిక (12) దీర్ఘకాలంగా కడుపు నొప్పి, వాంతులు, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతోంది. కుటుంబసభ్యులు ఆమెను గుడివాడలోని శ్రీరామా నర్సింగ్‌హోంలో చేర్పించారు.

వైద్యులు ఎండోస్కొపి, స్కానింగ్‌ల ద్వారా కడుపులో నల్లని గడ్డ ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం శస్త్రచికిత్స చేసి దాన్ని వెలికితీశారు. దాన్ని వెంట్రుకల గడ్డగా గుర్తించారు. దీన్ని వైద్య విధానంలో ట్రైకోబీజోఆర్‌ అంటారని, చిన్న వయసు నుంచి కొందరికి వెంట్రుకలు తినే అలవాటు ఉంటుందని డాక్టర్‌ వంశీకృష్ణ తెలిపారు. కొద్ది మొత్తంలో ఐతే బయటకు వస్తాయని, ఈ బాలిక ఎక్కువగా వెంట్రుకలు తినడానికి అలవాటుపడిందని, ఇవి కడుపులో పేరుకుపోయి జీర్ణకోశంలో పెద్ద గడ్డలా కట్టేశాయన్నారు.

సుమారు కిలో బరువున్న వెంట్రుకలు జీర్ణాశయాన్ని నింపివేయడంతో తిన్న అన్నం ఇమడక బయటకు రావడం, మిగిలిన కొద్ది ఆహారం జీర్ణంగాక శక్తి కోల్పోవడం జరుగుతోందని చెప్పారు. దీంతో బాలిక అనారోగ్యం పాలైనట్టు తెలిపారు. రక్తహీనత కలిగినవారు ఈ విధమైన తిండికి అలవాటుపడతారని, తల్లిదండ్రులు గమనించాలని ఆయన సూచించారు. 

మరిన్ని వార్తలు