వరుసగా రెండో ఏడాది నీటి బడ్జెట్‌లో మిగులు 

22 Apr, 2021 04:04 IST|Sakshi

బుధవారం ఉదయం వరకు 946.38 టీఎంసీలు మిగులు 

దేశంలో నీటి నిర్వహణలో మొదటి ర్యాంకు సాధించిన ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌ 

సాక్షి, అమరావతి: జలవనరులను ఒడిసి పట్టి యాజమాన్య పద్ధతులతో పొదుపుగా వాడుకుని అధిక విస్తీర్ణంలో సాగు చేసి ఎక్కువ దిగుబడులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది విజయం సాధించింది. ఆర్థిక బడ్జెట్‌ తరహాలో నీటి బడ్జెట్‌ను సమర్థంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల సమాచారం, యాజమాన్య వ్యవస్థ) ద్వారా ఎప్పటికప్పుడు లెక్కలను విశ్లేషిస్తున్న జలవనరుల శాఖ అధికారులు నీటి వృథాకు అడ్డుకట్ట వేసి పొదుపుగా వాడుకునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఫలితంగా బుధవారం ఉదయం 8.30 గంటల నాటికి ఈ నీటి సంవత్సరంలో 946.38 టీఎంసీలు మిగులు ఉండటం గమనార్హం. 

బొట్టు బొట్టుకూ లెక్క.. 
నీటి సంవత్సరం జూన్‌ 1తో ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. రాష్ట్రంలో ప్రతి రోజూ వర్షాన్ని రెయిన్‌గేజ్‌ల ద్వారా ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌ లెక్కిస్తుంది. అంతర్రాష్ట్ర నదుల ద్వారా వచ్చే ప్రవాహాన్ని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన గేజింగ్‌ కేంద్రాల ద్వారా అంచనా వేస్తుంది. భూగర్భంలోకి ఇంకే జలాలు, వాడుకునేలా జలాలను ఫీజియోమీటర్ల ద్వారా లెక్కిస్తుంది. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, చెరువుల్లో నిల్వ ఉన్న నీరు, రోజువారీ ఆయకట్టుకు విడుదల చేసే నీటిని జలవనరుల శాఖ అందజేసే రికార్డుల ఆధారంగా అంచనా వేస్తుంది. ఈ లెక్కలను బట్టి నీటి బడ్జెట్‌ను ఏపీడబ్ల్యూర్‌ఐఎంఎస్‌ నిర్వహిస్తుంది. ఎక్కడైనా నీటి వృథా జరిగితే జలవనరుల శాఖను అప్రమత్తం చేస్తుంది. ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేస్తున్నారు. 

దేశంలో నీటి నిర్వహణలో అత్యుత్తమం.. 
దేశవ్యాప్తంగా నీటి నిర్వహణపై 2019–20 నుంచి నేషనల్‌ వాటర్‌ మిషన్‌ పథకం కింద కేంద్ర జల్‌ శక్తి శాఖ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో గతేడాది ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌ మొదటి ర్యాంకు సాధించి అవార్డు దక్కించుకోవడం గమనార్హం. వర్షపాతం, అంతర్రాష్ట్ర నదీ ప్రవాహాల ఆధారంగా నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆవిరి, ప్రవాహ నష్టాలు, సాగు, తాగు, గృహావసరాలు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీటిని లెక్కిస్తూ వృథాకు అడ్డుకట్ట వేసి జలవనరులను సమర్థంగా వాడుకోవడంలో ఈ వ్యవస్థ అత్యుత్తమంగా పనిచేస్తోందని కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రశంసించింది.  

యాజమాన్య పద్ధతులపై ప్రత్యేక దృష్టి 
‘వర్షపాతం, అంతర్రాష్ట్ర నదీ ప్రవాహాల వల్ల వచ్చే జలాలను ఎప్పటికప్పుడు అంచనా వేయడం, రోజువారీ ప్రవాహ నష్టాలు, ఆవిరి నష్టాలు, వినియోగాన్ని లెక్కించడం, నీటి వృథాను పరిశీలించడం కోసం ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌ను ఏర్పాటు చేశాం. యాజమాన్య పద్ధతుల ద్వారా నీటిని పొదుపుగా వాడుకునేలా రైతులను చైతన్యం చేస్తున్నాం. నీటి వృథా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అడ్డుకట్ట వేసేందుకు అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్నాం. తాగు, గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత లేకుండా చేయగలిగాం. జలవనరుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం’ 
– సి.నారాయణరెడ్డి, ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్, జలవనరుల శాఖ 

మరిన్ని వార్తలు