నిమ్మగడ్డపైనే నిఘా పెట్టాలి

25 Jan, 2021 03:20 IST|Sakshi

ఆయనే ఎవరెవరినో కలుస్తున్నారు 

నిమ్మగడ్డను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు 

టీడీపీ నాయకులు మాపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు 

వాళ్లు హద్దుల్లో ఉండాలి.. మాకు రాజకీయాలు అంటగడతారా? 

వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకే ఎన్నికలు జరిపితే నష్టమేంటి? 

ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి  

సాక్షి, అమరావతి:  తనపై నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డీజీపీకి లేఖ రాశారని, అసలు నిఘా పెట్టాల్సింది ఆయనపైనేనని రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ కే వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయనే ఎవరెవరినో కలుస్తున్నారని, ఈ విషయం అందరికీ తెలుసని చెప్పారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయనను బెదిరించినట్లు, తన ద్వారా ఆయనకు ప్రాణహాని ఉన్నట్లు ఎన్నికల కమిషనర్‌ డీజీపీకి లేఖ రాయడం సరికాదన్నారు. ఆయన్ను బెదిరించాల్సిన అవసరం తనకు లేదని, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాత్రమే తాను చెప్పానని, అవి ఆయన్ను ఉద్దేశించి కాదన్నారు. అయినా, తనపై నిఘా పెట్టినా అభ్యంతరం లేదన్నారు. తాను ఉద్యోగులు, వారి రక్షణ గురించి మాత్రమే మాట్లాడానని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమిటని అడిగామని చెప్పారు. 

30 నెలలుగా ఏం చేశారు? 
ఎన్నికల కమిషనర్‌కి ప్రభుత్వానికి ఏదైనా ఉంటే వాళ్లే చూసుకోవాలని, వారి మధ్య జరిగే పోరాటంలో ఉద్యోగుల్ని బలి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వెంటనే ఎన్నికలు పెడితే వచ్చే లాభం, వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక జరిగితే వచ్చే నష్టం ఏమిటో ఎస్‌ఈసీ చెప్పాలని వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. 30 నెలల నుంచి ప్రత్యేక అధికారుల పాలన ఉందని, ఇంతకాలం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నా వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి వంటి నాయకులే సిద్ధంగా లేరని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారని.. సిద్ధంగా ఉన్న వారితో ఎన్నికలు జరుపుకోవచ్చని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని తెలిపారు.  

టీడీపీ అధికార ప్రతినిధి హద్దుల్లో ఉండాలి 
టీడీపీ అధికార ప్రతినిధి తమ గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఆయన హద్దుల్లో ఉండాలని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులను అడ్డగోలుగా వాడుకుంది టీడీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. సచివాలయం నుంచి బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్టుకి ఉద్యోగుల్ని తీసుకెళ్లారని.. ఢిల్లీలో దీక్షలు చేసి అక్కడికి తమను తీసుకెళ్లారని.. నవ నిర్మాణ దీక్షలు చేసి వాటికి ఉద్యోగులను తరలించారని.. ఇలా టీడీపీ ప్రభుత్వం వాడుకున్నంతగా ఉద్యోగుల్ని ఎవరూ వాడుకోలేదన్నారు. ఇప్పటి ప్రభుత్వం అలాంటి ఒక్కదానిక్కూడా ఉద్యోగులను తీసుకెళ్లలేదని చెప్పారు. ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి అరవపాల్‌ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్‌పై నిఘా పెట్టాలని తాము డీజీపీని కోరతామని చెప్పారు. తమపై మాట తూలితే సహించేది లేదన్నారు.    

మరిన్ని వార్తలు