ఎంఎస్‌ఎంఈల నమోదుకు సర్వే

24 Jul, 2023 04:30 IST|Sakshi

మన రాష్ట్రంలో ఉద్యం పోర్టల్‌ కింద నమోదైన ఎంఎస్‌ఎంఈలు 5,26,993  

పోర్టల్‌లో నమోదుతో ఆయా సంస్థలకు ఎంతో మేలు  

పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలని కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈలను)గుర్తించి వాటిని నమోదు చేసే బృహత్తర కార్యక్రమానికి ప్రభు­త్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో నమోదుకాని ఎంఎస్‌ఎంఈలకు ఎటువంటి ప్రభుత్వసాయం అందటం లేదు. కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యం పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలతో పాటు బ్యాంకు రుణాలు, ప్రభుత్వరంగ సంస్థలకు ఉత్పత్తులు విక్రయించే అవకాశాలు ఎంఎస్‌ఎంఈలకు ఏర్పడతాయి.

2015–16 శాంపిల్‌ సర్వే ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 33,87,000 నమోదుకాని ఎంఎస్‌ఎంఈలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. మన రాష్ట్రం నుంచి ఉద్యం పోర్టల్‌­లో నమోదైన ఎంఎస్‌ఎంఈల సంఖ్య 5,26,993 మాత్రమే. ఎంఎస్‌ఎంఈల సంఖ్య పరంగా మన రాష్ట్రం 13వ స్థానంలో ఉంది. 31.22 లక్షల ఎంఎస్‌ఎంఈలతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, 17.82 లక్షలతో తమి­ళనాడు రెండోస్థానంలో ఉన్నాయి. రాష్ట్రం­లో ఇలా నమోదుకాని ఎంఎస్‌ఎంఈలను గుర్తించి వాటిని నమోదు చేయించడం ద్వారా ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈ సర్వే పేరిట వాస్తవంగా ఉన్న ఎంఎస్‌ఎంఈల సంఖ్యను వెలికితీయనుంది. గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో ఈ వివరాలను సేకరించడానికి టీసీఎస్‌ సంస్థతో ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ ద్వారా ఎంఎస్‌ఎంఈ వ్యాపార పరిమాణ, ఏ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది, ఎంతమందికి ఉపాధి కల్పిస్తోంది, ఎంఎస్‌ఎంఈ ఇన్వెస్ట్‌మెంట్స్, ఎంప్లాయిమెంట్‌ వంటి అన్ని వివరాలను సేకరించనున్నారు.

ఈ సర్వే బాధ్యతను ప్రభుత్వం పరిశ్రమల శాఖతోపాటు జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఈ సర్వేకి సంబంధించి గ్రామ, వార్డు వలంటీర్లకు శిక్షణ ఇచ్చి తొలుత పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె.ఎస్‌.జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదే­శించారు. ఈ సర్వే అనంతరం వచ్చిన డేటా ఆధారంగా రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్దిష్ట కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు.

మరిన్ని వార్తలు