అమ్మ పాలకూ బ్యాంక్‌

7 Feb, 2023 03:27 IST|Sakshi

చనుబాలకు దూరమయ్యే బిడ్డలకు సాంత్వన

శిశువుల మరణాల నివారణ.. వారి ఆరోగ్య రక్షణే లక్ష్యం

ఇందుకోసం కాకినాడ జీజీహెచ్‌లో ‘మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌’

రూ.కోటి వ్యయం.. 8 గదులతో నిర్మాణం

రాష్ట్రంలో తొలి బ్యాంక్‌ ఇదే.. దేశంలో 8వ బ్యాంక్‌గా రికార్డు

బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను బ్యాంక్‌లో నిల్వ చేసేలా ఏర్పాట్లు

రాష్ట్ర ప్రభుత్వంతో ‘సుశేణ’ హెల్త్‌ ఫౌండేషన్‌ ఎంవోయూ

ఈ నెల 13న ప్రారంభించేందుకు ఏర్పాట్లు

అమ్మ పాలు అమృతం కంటే విలువైనవి. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు అద్భుతమైన ఔషధంలా పని చేస్తాయి. మరో విషయం ఏమంటే.. బిడ్డకు పాలివ్వడం తల్లి ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు కలుగుతుంది. తల్లి పాల నుంచి బిడ్డకు విటమిన్లు, ప్రొటీన్లు లభించడమే కాకుండా.. తల్లి స్పర్శ, వాత్సల్యపూరిత ఆలింగనం వల్ల బిడ్డ మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో భరోసా కలుగుతుంది. అంత గొప్ప విశిష్టత కలిగిన తల్లి పాలకు కొందరు బిడ్డలు దూరం కావాల్సి వస్తోంది. తల్లి పాలు దొరక్క నవజాత శిశువులు అక్కడక్కడ మరణిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు కాకినాడ జీజీహెచ్‌లో తల్లి పాల బ్యాంక్‌ ఏర్పాటు కాబోతోంది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. ఇప్పుడు అంతకంటే గొప్ప దానం మరొకటి రాబోతోంది. అదే తల్లి పాల దానం చేయవచ్చు. తల్లి పాలు దానం చేయడమేమిటని ఆశ్చర్యపోతున్నారా! ఔను.. తల్లి పాలను సైతం ఇకనుంచి దానం చేయొచ్చు. తల్లి పాలకు దూరమైన బిడ్డలకు ప్రాణ భిక్ష, ఆరోగ్య భిక్ష కల్పించవచ్చు. రక్తదానం మాదిరిగా అమ్మ పాలను దానంగా స్వీకరించి నిల్వ చేసేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో ‘మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌’ సిద్ధమవుతోంది. ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్‌) పీడియాట్రిక్‌ విభాగం పైఅంతస్తులో 8 గదులతో ప్రత్యేక బ్లాక్‌ ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘సుశేణ హెల్త్‌ ఫౌండేషన్‌’ మధ్య ఇందుకు సంబంధించి ఇటీవల ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ ఫౌండర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంతోష్‌కుమార్‌ దేశంలోనే 8వ మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ను ఈ నెల 13న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫౌండేషన్‌ రూ.కోటితో మూడు విడతల్లో దీని నిర్మాణం చేపడుతోంది.

తల్లి పాలు బిడ్డ ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో కీలకం. వీటి ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల కొందరు.. శరీరాకృతి మారిపోతుందనే అపోహతో మరికొందరు.. తల్లి పాలు రాక ఇంకొందరు పిల్లలు చనుబాలకు దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయంగా పోత పాలతో బిడ్డ ఆకలి తీరుస్తుండటం వల్ల బిడ్డల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆరోగ్యాన్ని పరోక్షంగా దెబ్బ తీస్తున్నాయి. 
తల్లి నుంచి పాలు సేకరిస్తున్న దృశ్యం (ఫైల్‌)   

బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను..
రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువగా ప్రసవాలు జరిగే టాప్‌–5లో ఉన్న కాకినాడ జీజీహెచ్‌ను ‘సుశేణ’ హెల్త్‌ ఫౌండేషన్‌ ఎంపిక చేసుకుంది. నవజాత శిశువు నుంచి రెండేళ్ల బిడ్డ వరకు ఈ బ్యాంక్‌లో పాలు ఇస్తారు. తల్లి బిడ్డకు ఇవ్వగా మిగులు పాలను సేకరించి అవసరమైన పిల్లలకు అందిస్తారు. హెచ్‌ఐవీ, వీడీఆర్‌ఎల్‌ (వెనెరియల్‌ డిసీజ్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ టెస్ట్‌), హెపటైటిస్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వస్తేనే తల్లి పాలు తీసుకుంటారు. కాగా, ఇక్కడ తల్లుల చనుబాల పరిమాణం పెంచేందుకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలపై అవగాహన కల్పిస్తారు.

మసాజ్‌ థెరఫీ, న్యూట్రిషనల్‌ ట్రీట్‌మెంట్‌ (పోషకాలతో కూడిన వైద్యం), మదర్‌కేర్‌ (బిడ్డను హత్తుకుని పాలిచ్చే) తరహాలో తల్లులకు బిడ్డలను కనీసం గంటపాటు హత్తుకుని ఉండేటట్టు ఈ బ్యాంక్‌లోని ప్రత్యేక వార్డులో నిపుణుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలా ఈ బ్యాంక్‌లో రెండు, మూడు రోజులు ఉంచి తల్లులకు అవగాహన వచ్చాక ఇంటి వద్ద ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించి పంపేస్తారు. స్వచ్ఛంద దాతలు జీజీహెచ్‌ మిల్క్‌ బ్యాంక్‌కు వచ్చి పాలు దానం చేయవచ్చు.

ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఉచితం. తొలి దశలో సేకరించిన పాలను నిల్వ చేయకుండా వెంటనే అవసరమైన శిశువులకు పట్టిస్తారు. రెండో దశలో పాలను నిల్వ చేస్తారు. కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా ఏడాది పాటు వాటిని పాడవకుండా భద్రపరుస్తారు. ఇందుకు ప్రత్యేక యంత్రాలు జీజీహెచ్‌లో సిద్ధమయ్యాయి. తొలి దశ ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలో మిల్క్‌ పాశ్చరైజేషన్‌ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఏపీలో తొలి బ్యాంక్‌
సామాజిక బాధ్యతలో భాగంగా నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత తీసుకున్నాం. రాష్ట్రంలోనే తొలిసారి కాకినాడ జీజీహెచ్‌లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాం. ప్రభుత్వంతో ఇటీవలనే ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇది సాధ్యమవుతోంది.
    – రమేష్‌ లక్కర్సు, కన్సల్టెంట్‌ ప్రోగ్రాం మేనేజర్, సుశేణ హెల్త్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి

విస్తృతం చేస్తాం
ఈ సేవలను విస్తృతం చేసేందుకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించాం. మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు జీజీహెచ్‌లో పరిస్థితులు ఉండటంతో సుశేణ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది.
    – డాక్టర్‌ హేమలతాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ

శిశువుల ప్రాణాలకు రక్ష
కాకినాడ జీజీహెచ్‌లో ప్రతి నెలా 700 నుంచి 800 ప్రసవాలు జరుగుతున్నాయి. రెండున్నర కేజీల కంటే తక్కువ బరువుతో పుడుతున్న నవజాత శిశువుల సంఖ్య 75 నుంచి 85 మధ్య ఉంటుంది. కిలో కంటే తక్కువ బరువుతో పుడుతున్న వారు 10 మంది ఉంటున్నారు. ఈ బ్యాంక్‌ శిశువుల ప్రాణ రక్షణకు తోడ్పడుతుంది.
    – ఎంఎస్‌ రాజు, హెచ్‌వోడీ, పీడియాట్రిక్, జీజీహెచ్, కాకినాడ  

మరిన్ని వార్తలు