పాపాల పుట్టలు పగులుతున్నాయ్

25 Feb, 2021 17:50 IST|Sakshi

నాడు శ్రీశైలం.. నేడు దుర్గమ్మ క్షేత్రం 

ఏళ్ల తరబడి కొనసాగుతున్న అవినీతి దందాకు ప్రభుత్వం చెక్‌  

దుర్గ గుడిలో 15 మంది ఉద్యోగుల సస్పెన్షన్‌ 

6 నెలల క్రితం శ్రీశైలంలోనూ 11 మంది ఉద్యోగులపై వేటు 

సాక్షి, అమరావతి: భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. పెద్ద ఆలయాల్లో అవినీతికి ఆస్కారం ఉన్న విభాగాల్లో కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి తిష్ట వేసి సాగిస్తున్న అవినీతి దందాలపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. విజయవాడ దుర్గగుడిలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఉద్యోగుల అవినీతి బట్టబయలైంది. పదేళ్లుగా దుర్గమ్మ ఆలయ ఆస్తుల రిజిస్టర్‌ను సరిగా నిర్వహించడం లేదన్న విషయం కూడా బయటపడింది. అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలు సహా ఆలయానికి వచ్చే ఆదాయం, ఆస్తుల వివరాలను 43వ నంబర్‌ రిజిస్టర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉండగా, పదేళ్లుగా అలాంటివేవీ నమోదు చేయడం లేదని ఏసీబీ అధికారులు తేల్చారు. అవినీతికి పరాకాష్టగా మారిన ఈ వ్యవహారంలో 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం దేవదాయ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. 

శ్రీశైలం ఆలయంలోనూ.. 
2020 జూన్‌లో ఏసీబీ అధికారులు శ్రీశైలం ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. 2016 ఏప్రిల్‌ నుంచి ఆలయంలో చోటుచేసుకున్న అక్రమాలను బయటపెట్టారు.  స్వామివారి దర్శన టికెట్లకు సంబంధించి దాదాపు రూ.2.50 కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకున్నట్టు అప్పట్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. అప్పట్లో టికెట్ల విక్రయ విభాగంలో పనిచేసే 26 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉన్నారన్న ఆరోపణలతో ఆరు నెలల క్రితం 11 మంది ఆలయ రెగ్యులర్‌ ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. 

ప్రసాదాల నుంచి ఫొటోల వరకూ.. 
దుర్గ గుడిలో కీలకంగా పనిచేసే ఓ ఉద్యోగి సంప్రదాయ విక్రయ కౌంటర్‌లో తన సమీప బంధువును అనధికారికంగా నియమించి భారీగా సొమ్ములు దిగమింగుతున్నట్టు ఏసీబీ తేలి్చంది. అమ్మవారి దర్శన టికెట్ల అమ్మకాలకు సంబంధించి ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ ఆధ్వర్యంలో జరిగే లావాదేవీలకు సంబంధించిన రశీదుల రిజిస్టర్‌లో సూపరింటెండెంట్‌ సంతకాలు ఉండటం లేదని, టికెట్ల విక్రయాల్లో భారీ లొసుగులు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. భక్తులు అందజేసే చీరల్ని ఉంచే గొడౌన్, అమ్మవారి ఫొటోలు అమ్మే విభాగంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఏసీబీ తేల్చింది. అన్న ప్రసాద విభాగంలో కూరగాయలు, పాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించింది. అన్నదానం కోసం భక్తులు ఇచ్చిన రూ.54,31,382 నగదును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయకుండా బ్యాంకు ఖాతాలో అలా ఉంచినట్టు తేల్చారు. కొందరు ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులు ఆరు నెలలకు పైగా విధులకు హాజరుకాకపోయినా వారిని కొనసాగిస్తున్నట్టు నిర్ధారించారు.  

దుర్గ గుడికి మళ్లీ వచ్చిన ఏసీబీ 
ఇంద్రకీలాద్రి (విజయవాడ, పశ్చిమ):  ఏసీబీ అధికారులు మరోమారు బుధవారం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. బ్రాహ్మణ వీధిలోని దేవస్థాన పరిపాలనా భవనానికి వెళ్లిన అధికారులు ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. ఇంతకుముందు ఆలయంలో జరిపిన తనిఖీలకు సంబంధించి కొన్ని కీలక పత్రాల గురించి ఆరా తీయడంతో పాటు కొన్ని సంతకాలు తీసుకున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా.. ఆలయ ఈవో ఎంవీ సురేష్ బాబు తీరుపై సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన అంతర్గత బదిలీల సందర్భంగా ఈవో తనకు అనుకూలంగా ఉన్న  వారిని అందలం ఎక్కించినట్టు పేర్కొంటున్నారు.  కిందిస్థాయి ఉద్యోగులకు సూపరింటెండెంట్‌ స్థాయి బాధ్యతలు అప్పగించగా.. సూపరింటెండెంట్‌ స్థాయి అధికారులకు కింది స్థాయిలో విధులు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ఇంద్రకీలాద్రిపై ఎవరి దందా వారిదే 
దుర్గ గుడిలో పదేళ్లుగా కొనసాగుతున్న అనేక అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని కొన్ని కీలక విభాగాల్లో ఏళ్ల తరబడి తిష్ట వేసిన ఉద్యోగులు ఎవరికి వారు అవినీతి దందాలను కొనసాగిస్తున్నట్టు తేలింది. ఈవోలు కూడా ఆ ఉద్యోగుల దందాకు వంత పాడుతూ వస్తున్నారు.ఆలయ ఆస్తులకు సంబంధించిన 43 రిజిస్టర్‌తో పాటు షాపులు, భూముల లీజులకు సంబంధించిన 8ఏ రిజిస్టర్‌ను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని ఏసీబీ తేల్చింది. వాటికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది. సెక్యూరిటీ గార్డులు, సూపర్‌వైజర్లను సమకూర్చేందుకు టీడీపీ హయాంలో మాక్స్‌ డిటిక్టెవ్‌ అండ్‌ గార్డింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.

నిబంధనల ప్రకారం దానికి దేవదాయ శాఖ కమిషనర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉండగా.. అనుమతులు పొందకుండానే రెండేళ్లుగా ఆ ఏజెన్సీని కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లిస్తున్నారు. ఆరేళ్లుగా ఆలయ పర్యవేక్షక సూపరింటెండెంట్‌ బాధ్యతలు చూస్తున్న ఉద్యోగికి ఆ ప్రైవేట్‌ ఏజెన్సీతో బినామీ లావాదేవీలున్నట్టు ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం ఆలయాలు సహకార డెయిరీల నుంచే నెయ్యి కొనుగోలు చేయాల్సి ఉండగా,  గత కొన్నేళ్లుగా గుంటూరు జిల్లా టీడీపీ నాయకుడికి చెందిన డెయిరీ నుంచి ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్టు తేలింది.   

మరిన్ని వార్తలు