ఆర్‌సీలు, లైసెన్సు పత్రాలు చూపినా ఓకే

19 Jan, 2021 05:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డుల డెలివరీలో రవాణాశాఖకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనదారుడు ఇంటి చిరునామా సరిగా ఇవ్వకపోవడం, కార్డుల ముద్రణలో సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో ఈ కార్డులు డెలివరీ కావడం లేదు. ఆధార్‌ కార్డుల్లో అడ్రస్‌ వేరుగా ఉండటం, లైసెన్సుకు దరఖాస్తు, వాహన రిజిస్ట్రేషన్‌ సమయంలో అడ్రస్‌ మార్చకపోవడం వల్ల రోజూ డెలివరీ అయ్యే ఆర్‌సీ, లైసెన్సు కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో తిరిగి రవాణాశాఖ కార్యాలయాలకు వస్తున్నాయి. దీంతో తనిఖీల సమయంలో వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ పత్రాలు చూపించినా.. అనుమతించాలని రవాణాశాఖ అధికారులు జిల్లాల పోలీస్‌ అధికారులకు లేఖలు రాస్తున్నారు.  

రిజిస్ట్రేషన్, కార్డులు గతేడాది నవంబర్, డిసెంబర్‌ నెలల్లో సరిగా అందించలేదు. కాంట్రాక్టు సంస్థ సరఫరా చేయకపోవడంతో కొన్ని జిల్లాల్లో కొరత ఏర్పడింది. దీంతో వాహన తనిఖీల సమయంలో పత్రాలు చూపిస్తే పోలీసులు అనుమతించకుండా జరిమానా వసూలు చేశారు. ఇప్పుడు వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్న దృష్ట్యా పత్రాలు చూపిస్తే అనుమతించాలని రవాణా అధికారులు జిల్లా స్థాయిలో రోడ్‌ సేఫ్టీ కమిటీల ద్వారా పోలీస్‌ శాఖను కోరారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రత మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మాసోత్సవాల్లో భాగంగా రోడ్‌ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ ఆదేశాలతో పోలీసులు, రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీ చేశారు. వాహనదారులు పత్రాలు చూపిస్తూ.. లైసెన్సు, రిజిస్ట్రేషన్‌ కార్డులు చూపించ కపోవడంతో పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఆర్‌సీ కార్డుల జారీలో జాప్యంతో పాటు కోవిడ్‌ కారణంగా పత్రాలు ఫోన్‌లో చూపించినా.. వదిలిపెట్టాలని, జరిమానా విధించవద్దని సూచనలు జారీ అయ్యాయి.

గతేడాది 1,932 లైసెన్సుల సస్పెన్షన్‌
రాష్ట్రంలో గతేడాది పదేపదే ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు సంబంధించిన 1,932 లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్‌ చేసింది. లైసెన్సులు లేకుండా వాహనం నడిపితే జైలుకు పంపుతామని రవాణాశాఖ స్పష్టం చేసింది. వాహన డ్రైవర్లు ఉల్లంఘనలకు పాల్పడినా, ప్రమాదాలకు కారకులైనా.. వారికి పునశ్చరణ తరగతులు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు