‘డయేరియా’ బాధ్యులపై సస్పెన్షన్‌ వేటు

11 Apr, 2021 04:44 IST|Sakshi

నలుగురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన కర్నూలు జిల్లా కలెక్టర్‌

కర్నూలు (సెంట్రల్‌): కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు, ఆదోనిలోని అరుంజ్యోతి నగర్‌లో తాగునీరు కలుషితమవుతున్నా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి డయేరియా ప్రబలడానికి కారణమైన నలుగురు ఉద్యోగులను జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ శనివారం సస్పెండ్‌ చేశారు. మరో నలుగురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పాణ్యం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ బి.పవన్‌కుమార్, గోరుకల్లు పంచాయతీ సెక్రటరీ జి.విజయభాస్కర్, ఆదోని మునిసిపాలిటీ వాటర్‌ సప్లై ఏఈ టి.రాజశేఖరరెడ్డి, వాటర్‌ సప్లై టర్న్‌ కాక్‌ ఎం.ఈరన్నలను సస్పెండ్‌ చేశారు. అలాగే పాణ్యం ఈవోఆర్‌డీ కె.భాస్కరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ ఎన్‌.ఉమాకాంత్‌రెడ్డి, ఆదోని మునిసిపాలిటీ వాటర్‌ సప్‌లై డీఈవో జి.సురేష్, వాటర్‌ సప్‌లై ఈఈ ఎ.సత్యనారాయణలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 

విచారణ కమిటీల నియామకం
డయేరియా ప్రబలడానికి కారణాల అన్వేషణ, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ విచారణ కమిటీలను నియమించారు. ఆదోనిలోని అరుంజ్యోతి నగర్‌లో విచారణ కోసం ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి నేతృత్వంలో అనంతపురం జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ ఆర్‌.శ్రీనాథ్‌రెడ్డి, కర్నూలు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎస్‌ఈ సురేంద్రబాబుతో కమిటీ వేశారు. గోరుకల్లులో విచారణ కోసం నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి నేతృత్వంలో కర్నూలు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ విద్యాసాగర్, డీపీవో కేఎల్‌ ప్రభాకరరావు సభ్యులుగా కమిటీని నియమించారు.  

మరిన్ని వార్తలు