వేట మొదలైంది... వేటు పడింది.. 

6 Dec, 2020 08:35 IST|Sakshi
సస్పెండ్‌ అయిన మేనేజర్లు శ్యామల, గణపతి

ఇద్దరు మేనేజర్‌ల సస్పెన్షన్‌

మిగిలిన వారిపై త్వరలో చర్యలు

రూ.23 కోట్ల కుంభకోణంలో డీసీసీబీ కొరడా

గండేపల్లి సొసైటీని ముంచేసిన ఒక కుటుంబ స్వార్థం

అన్నదాతలకు మేలు చేసే సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను.. సకుటుంబ సపరి‘వాటం’గా దోచుకున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు డీసీసీబీ పాలకవర్గం కొరడా ఝళిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సొసైటీలకు అణువణువునా పట్టిన అవినీతి చీడను వదిలిస్తోంది. గండేపల్లి సొసైటీలో జరిగిన రూ.23 కోట్ల కుంభకోణంలో ఇద్దరు అధికారులపై వేటు వేసింది. మిగిలిన వారి కోసం వేట కొనసాగిస్తోంది.

సాక్షి, రాజమహేంద్రవరం: గత టీడీపీ పాలనలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(సొసైటీలు) నిధులను కొంతమంది అక్రమార్కులు పీల్చి పిప్పి చేశారు. బినామీ పేర్లతో కోట్లాది రూపాయలు కొట్టేసి, సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి, రైతులను నిలువునా ముంచేశారు. డీసీసీబీతో పాటు సొసైటీల్లో కూడా ‘పచ్చ’నేతలు సొసైటీ ప్రెసిడెంట్ల ముసుగులో తిష్ట వేసి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఈ అవినీతి బాగోతాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) పాలకవర్గం ఆ అవినీతిపరుల భరతం పడుతోంది. రైతులకు చెందాల్సిన సొమ్మును యథేచ్ఛగా దోచుకున్న వారితో కుమ్మక్కయిన అధికారులపై వేటు మీద వేటు వేస్తోంది.

టీడీపీ హయాంలో గండేపల్లి సొసైటీలో అప్పటి ప్రెసిడెంట్‌ తన కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు తయారు చేసి రూ.23 కోట్లు కాజేసిన విషయాన్ని ‘సాక్షి’ వరుస కథనాలతో బయట పెట్టింది. గత సెప్టెంబర్‌ 24న ‘‘ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లు పైమాటే’’, అక్టోబరు 6న ‘‘సకుటుంబ సపరి‘వాట’ంగా’’, నవంబరు 3న ‘‘రాబంధువుల లెక్కల చప్పుడు’’ శీర్షికలతో గండేపల్లి సొసైటీలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిని బట్టబయలు చేసింది. వీటిపై స్పందించిన డీసీసీబీ చైర్మన్‌ అనంత ఉదయభాస్కర్‌ డీసీ సీబీ డీజీఎంలు కె.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీధర్‌చౌదరి ఆధ్వర్యాన రెండు నెలల పాటు విచారణ చేసి, జరిగిన అవినీ తి నిగ్గు తేల్చారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తున కు సహకార రంగంలో కీలక మైన 51 విచారణ చేయాలని నిర్ణయించారు.

ఈ కుంభకోణంలో ప్రాథమికంగా బాధ్యులుగా తేలిన గండేపల్లి సొసై టీ ప్రస్తుత మేనేజర్‌ ఆర్‌.శ్యామల, గతంలో ఇక్కడ పని చేసి ప్రస్తుతం కొత్తపేటలో పని చేస్తున్న మేనేజర్‌ హెచ్‌ ఎస్‌ గణపతిలపై అనంతబాబు ఆదేశాల మేరకు డీసీసీ బీ సీఈఓ ప్రవీణ్‌కుమార్‌ స స్పెన్షన్‌ వేటు వేశారు. వీరితో పాటు విచారణలో బాధ్యులు గా గుర్తించిన డీసీసీబీ అసిస్టెంట్‌ మేనేజర్‌ డీవీ సూర్యం, లీగల్‌ అధికారులు త్రినాథ్, ఎ.శ్రీనివాసరావుతో పాటు రిటైరైన మరో ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరిపై కూడా త్వరలో వేటు పడే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో ఆ సొసైటీతో పాటు, డీసీసీబీ బ్రాంచిలో పని చేస్తున్న వారి పాత్ర ఏమేరకు ఉందో నిగ్గు తేల్చే పనిలో డీసీసీబీ వర్గాలున్నాయి.  చదవండి: (దేవుళ్లకే శఠగోపం!)

రికవరీ సవాలే.. 
ఈ అవినీతి బాగోతానికి తెర వెనుక సహకరించిన వారిపై వేటు వేసిన డీసీసీబీ.. చంద్రబాబు హయాంలో రూ.23 కోట్లు దారి మళ్లించిన సొసైటీ అధ్యక్షుడు పరిమి బాబు సహా ఇతరుల నుంచి సొమ్ము రికవరీ చేయాల్సి ఉంది. ఈ పని డీసీసీబీకి పెద్ద సవాల్‌ కానుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గండేపల్లి సొసైటీలో 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఇచ్చిన రుణాల్లో సుమారు రూ.23 కోట్లను అధ్యక్షుడు, తన బంధువర్గం పేరిట మంజూరు చేసుకుని దారి మళ్లించేశారు. సొసైటీలో 155 మంది పేర్లతో రూ.22.83 కోట్ల రుణాలు మంజూరైతే సింహభాగం అప్పటి సంఘం అధ్యక్షుడి కుటుంబ సభ్యులు, సంఘం సీఈఓ, సిబ్బంది ఖాతాలకు జమ అవడాన్ని ప్రస్తుత డీసీసీబీ చైర్మన్‌ అనంతబాబు తీవ్రంగా పరిగణించారు. విచారణను నీరుగార్చి, అవినీతిపరులను కాపాడేందుకు పలువురు చేసిన ప్రయత్నాలను కూడా చైర్మన్‌ తిప్పికొట్టారు.  చదవండి: (టీడీపీ హయాంలో విచ్చలవిడి అవినీతి)

చంద్రబాబు హయాంలో నొక్కేసిన కోట్లాది రూపాయలు తిరిగి రాబట్టేందుకు డీసీసీబీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అప్పట్లో సొసైటీ అధ్యక్షుడిగా పని చేసిన పరిమి సత్యనారాయణ (బాబు) రూ.7.13 కోట్లు, ఆయన భార్య వెంకట సత్య మంగతాయారు రూ.1.08 కోట్లు, ఆయన బంధువు పి.కృష్ణ శ్రీనివాస్‌ రూ.6.76 కోట్లు, సీఈ ఓ పి.సత్యనారాయణ రూ.53.92 లక్షలు, స్టాఫ్‌ అసిస్టెంట్‌ జి.సత్యనారాయణ రూ.7.85 లక్షలు, సబ్‌ స్టాఫ్‌ వెంకటలక్ష్మి రూ.2 లక్షలు, పరిమి బాబు కారు డ్రైవర్‌ సత్యనారాయణ రూ.4 లక్షలు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్రీహరి రూ.4 లక్షలు, స్టాఫ్‌ అసిస్టెంట్‌ కనకరాజు రూ.5.90 లక్షలు, డ్రైవర్‌ భార్య పేరిట రూ.2 లక్షలు బదిలీ చేసినట్టు ఈ కుంభకోణంపై విచారణ చేస్తున్న అధికారులు లెక్క తేల్చారు.

నిబంధనలకు విరుద్ధంగా సోమన కిశోర్‌బాబుకు రూ.44.54 లక్షలు, చల్లాప్రగడ సత్య నాగ భాస్కర్‌ శ్రీనివాసరావుకు రూ.43 లక్షలు, మదడ శ్రీనివాసుకు రూ.42.09 లక్షలు ఇచ్చినట్టు తేల్చారు. వారి నుంచి ఈ సొమ్మును ఎలాగైనా రికవరీ చేయాలని చైర్మన్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనిపై డీసీసీబీ కసరత్తు చేస్తోంది. ఒక కుటుంబం స్వార్థంతో అవినీతికి పాల్పడి గండేపల్లి సొసైటీని నష్టాల్లోకి నెట్టేసింది. దీంతో ఆ సొసైటీ పరిధిలోని రైతులకు రుణాలు అందకుండా పోయాయి. ఇప్పుడు కొత్తగా రుణాలు ఇవ్వాలన్నా సొసైటీలో అవకాశం లేకుండా చేశారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఎప్పటికి రాబడతారోనని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎవరినీ విడిచిపెట్టేది లేదు 
సహకార వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు ఎంతటి వారై నా విడిచిపెట్టేది లేదు. వారు ఏ పార్టీలో ఉన్నా ఉపేక్షించే ప్రశ్నే లేదు. గండేపల్లి సొసైటీలో బినామీ పేర్లతో కోట్ల రూపాయలు స్వాహా చేసి, రైతులను తీవ్రంగా దెబ్బ తీసిన ప్రెసిడెంట్‌ పరిమి బాబు నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టేందుకు ఉన్న ఏ మార్గాన్నీ డీసీసీబీ విడిచిపెట్టదు. టీడీపీ హయాంలోని సొసైటీ పాలకవర్గాల్లో వ్యక్తిగత స్వార్థం కోసం సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసిన వారందరి జాతకాలూ బయట పెడతాం. గండేపల్లి సొసైటీలో బయటపడిన రూ.23 కోట్ల కుంభకోణంతో పాటు మిగిలిన సొసైటీల అవినీతి వ్యవహారాలను కూడా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాను. ఈ అవినీతి బాగోతంతో గండేపల్లి సొసైటీ పూర్తిగా నష్టాల్లోకి పోయింది. సొసైటీ పరిధిలోని గండేపల్లి, ఎన్‌టీ రాజాపురం, రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామాల్లోని 934 మంది సభ్యులకు రుణాలివ్వలేని పరిస్థితి తీసుకువచ్చారు. కొత్త సభ్యులను చేర్చుకున్నా వారికి కూడా రుణాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది.  – అనంత ఉదయభాస్కర్, డీసీసీబీ చైర్మన్‌ 

మరిన్ని వార్తలు