తనకెవ్వరూ సాటిరారని నిరూపించాడు.. దానిని తట్టుకోలేకే చంపేశారా?

15 Jun, 2022 08:03 IST|Sakshi
 విజయ్‌(ఫైల్‌) 

నగరి: తక్కువ ధరకే వివాహాలు, శుభకార్యాలకు ఆర్డర్లు పట్టేశాడు. వ్యాపారంలో తనకు సాటిరారని నిరూపించాడు. ఇదే ఇతని ప్రాణాలమీదికి తెచ్చినట్టు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈనెల 9వ తేదీన అదృశ్యమైన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం.. నగరి మునిసిపల్‌ పరిధి, కొత్తపేటకు చెందిన విజయ్‌ (22) స్థానికంగా లక్ష్మీ డెకరేటర్స్, ఈవెంట్స్‌ పేరిట పూల దుకాణం నడుపుతున్నాడు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు పుష్పాలంకరణ చేస్తుంటాడు.

ఈ నెల 9వ తేదీన పలు వివాహ వేడుకలకు పుష్పాలంకరణ చేశాడు. అనంతరం అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన తమిళనాడు వేలూరులోని ఒక లాడ్జీ నుంచి బయటకు పరుగులు తీస్తూ వచ్చిన విజయ్‌ విషం తాగేశానని, కాపాడాలంటూ కేకలు వేశాడు. అక్కడున్న వారు అతన్ని ఆస్పత్రికి చేర్చగా నాలుగురోజుల పాటు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఇతని మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేలూరు పోలీసులు విచారణ చేపట్టారు.  

కిడ్నాప్‌ చేసి విషం తాగించారా? 
విజయ్‌ తక్కువ ధరకే పూలడెకరేషన్స్‌ చేస్తుంటాడు. ఈ విషయమై తమిళనాడుకు చెందిన కొందరు వ్యాపారులతో వివాదాలు కూడా జరిగినట్టు సమాచారం. ఇదే ఇతని మృతికి పరోక్షంగా కారణమైనట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మృతుడు అవివాహితుడు, కాగా ఈ నెల 20వ తేదీన అతనికి పుట్టిన రోజు అని, అంతలో మృతిచెందాడని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

చదవండి: (Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం)

మరిన్ని వార్తలు