శ్రీశైలంలో డ్రోన్‌ కలకలం

5 Jul, 2021 08:57 IST|Sakshi
ఆకాశంలో చుక్క రూపంలో కనిపిస్తున్న డ్రోన్‌ 

శ్రీశైలం: గుర్తు తెలియని డ్రోన్‌ నాలుగు రోజులుగా శ్రీశైల మహాక్షేత్రంలో అత్యంత ఎత్తులో చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఆలయ ప్రాంగణం, మల్లమ్మ గుడి వెనుకాల నుంచి తక్కువ ఎత్తులోకి రావడంతో గమనించిన భద్రతా సిబ్బంది ఆలయాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విషయం తెలియజేశారు. దీంతో దేవస్థాన అధికారులతో పాటు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది డ్రోన్‌ను గుర్తించారు. దానిని వెంబడించేందుకు దేవస్థానం డ్రోన్‌ను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని గమనించి డ్రోన్‌ను నియంత్రిస్తున్న అపరిచిత వ్యక్తి సిగ్నల్స్‌ను ఆపివేశారు.

అనంతరం అది కనిపించకుండాపోయింది. శ్రీశైల మహాక్షేత్రానికి ఉగ్రవాదుల ముప్పు ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు గతంలోనే హెచ్చరించాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పరిధిలోని రెండో పవర్‌హౌస్‌లో విద్యుదుత్పాదనను నిరంతరం కొనసాగిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం భారీగా సెకండ్‌ పవర్‌హౌస్‌ వద్ద పోలీస్‌ బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన టెక్నికల్‌ సిబ్బంది డ్రోన్‌ను వినియోగించి ఫొటోలు, వీడియోల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారన్న అనుమానాలూ లేకపోలేదు. ఘటనపై శ్రీశైలం సీఐ వెంకటరమణ మాట్లాడుతూ డ్రోన్‌ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. శ్రీశైలంలోని సత్రాలు, అతిథి గృహాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. డ్యామ్‌ వద్ద 40 మందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్టు వివరించారు.

మరిన్ని వార్తలు