ఇక్కడా ఉంది... ఓ స్వర్ణ ప్యాలెస్‌

13 Aug, 2020 13:41 IST|Sakshi
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి ఇదే 

రాజమహేంద్రవరంలో విజయవాడ మాదిరి స్వర్ణ ప్యాలెస్‌లో దందా

లాడ్జి గదులను అద్దెకు తీసుకొని కోవిడ్‌ వైద్యం  

సాధారణ వైద్యుడే రూ.లక్షల్లో వసూళ్లు 

విజయవాడ ఘటన పునరావృతం కాకుండా చూడాలంటున్న జనం  

ఫిర్యాదుతో విచారణ ప్రారంభించామని తెలిపిన డీఎమ్‌హెచ్‌వో 

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం ...పది మంది మృతి ఘటన భయానక దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. అలాంటి దుర్ఘటనలు ఇతర జిల్లాల్లో జరగకూడదని అధికార యంత్రాంగం నిఘా వేస్తున్న వేళ...రాజమహేంద్రవరంలో ఎంచక్కా ఓ లాడ్జిలోని గదులను అద్దెకు తీసుకొని కోవిడ్‌ రోగులకు ఓ సాధారణ వైద్యుడు లక్షల రూపాయలు గుంజుకుంటూ చికిత్స అందిస్తున్న వైనం తాజాగా బయటపడింది. కోవిడ్‌ రోగికి ఎంత సీరియస్‌గా ఉన్నా సరే చిటికెలో బాగు చేసేస్తామంటూ ఫీజుల రూపంలో లక్షల రూపాయలు గుంజుతూ చివరిలో ‘సారీ’ చెప్పి శవాన్ని అప్పగిస్తున్నారు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సమీపంలో ఉన్న ఓ ఆసుపత్రిలో రోగులను పెట్టకుండా మెయిన్‌ రోడ్డులో ఓ ప్యాలెస్‌లో (లాడ్జి) గదులు అద్దెకు తీసుకుని చికిత్స అందిస్తున్నారు.

వారి వద్దనుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ దందాకు తెరలేపుతున్నాడు ఓ సాధారణ వైద్యుడు. దగ్గు, జ్వరం  లక్షణాలతో వస్తే చాలు కోవిడ్‌గా నిర్ధారించేసి వైద్యం ప్రారంభించేస్తున్నారు. ఎటువంటి భద్రతా నిబంధనలు అక్కడ కానరావు. కోవిడ్‌ వైద్య చికిత్సలకు తాము సూచించిన ఆసుపత్రులు మినహా ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని, హోటళ్లలో నిర్వహణకు అనుమతే లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ బాగోతంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందడంతో డీఎంహెచ్‌వో దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా అడిషనల్‌ డీఎంహెచ్‌వోకు ఆదేశాలు జారీచేశారు. అయితే అక్కడ ఏమీ లేదని, దీనిపై విచారణ చేశామని ఆమె చెబుతుండడం గమనార్హం. అయితే బాధితులు నేరుగా తమకే ఫిర్యాదు చేశారని, ఫోన్‌లో సంభాషణ ఆడియో క్లిప్‌లు తమ వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా వెంటనే విచారణ ప్రారంభించామని డీఎంహెచ్‌వో సుబ్రమణ్వేశ్వరి ‘సాక్షి’కి తెలిపారు. దందా నిజమేనని, స్వయంగా బాధితుల ఆడియో క్లిప్పింగ్‌లు తన వద్ద ఉన్నాయని ఉన్నతాధికారి చెబుతుండగా ... కిందిస్థాయి అధికారి మాత్రం ‘అబ్బే...అక్కడేమీ జరగడం లేద’ని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.  

మా అమ్మ చనిపోతుందని తెలిసినా డబ్బులు గుంజారు 
మా అమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స అందించాం. అక్కడ వైద్యులు ఆమె పరిస్థితి బాగోలేదు తీసుకెళ్లిపొమ్మని చెప్పారు. ఉదయం నుంచి అర్ధ్రరాత్రి వరకు ఎన్నో ఆసుపత్రులకు ఆటోలో తిప్పాం. ఎవరూ జాయిన్‌ చేసుకోలేదు. అయితే సెంట్రల్‌ జైలు వద్ద ఒక ఆసుపత్రి ఉంది ... అక్కడకు వెళ్లమంటే వెళ్లాం. అక్కడ వైద్యులు చూసి ‘చూద్దాం బతికిద్దాం...ముందుగా రూ.1.50 లక్షలు కట్టండ’ని తెలిపారు. డబ్బులు అప్పుచేసి తెచ్చి రూ.50 వేలు కట్టాను. మర్నాడు ఉదయం అమ్మ చనిపోయింది. కనీసం ఐసీయూలో కూడా పెట్టలేదు, ఆక్సిజన్‌ ఇవ్వలేదు. రెండు ఇంజక్షన్లు, సిలైన్‌ పెట్టి వదిలేసి... ఒక్కరోజుకు రూ.50 వేలు తీసుకున్నారు.–శ్రీనివాస్, రాజమహేంద్రవరం 

అనుమతి ఎవరికీ ఇవ్వలేదు 
కోవిడ్‌ చికిత్సకు మేము సూచించిన ఆసుపత్రులు తప్ప అదనంగా ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. హోటల్‌లో కోవిడ్‌ చికిత్స చేసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటాం.– అభిషిక్త్‌ కిశోర్, కమిషనర్, రాజమహేంద్రవరం 

విచారణ ప్రారంభించాం 
కోవిడ్‌ చికిత్సకు ఆ ఆసుపత్రికి ఎటువంటి అనుమతి లేదు. అలాగే మెయిన్‌ రోడ్డులో ఓ ప్యాలెస్‌లో కోవిడ్‌ రోగులను ఉంచి చికిత్స చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. దానికి సంబంధించి మా వద్ద ఓ ఆడియో క్లిప్‌ కూడా ఉంది. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాం. దీనికి సంబంధించి రిపోర్టు రావాల్సివుంది. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. చర్యలు తప్పవు.– సుబ్రహ్మణ్వేశరి,డీఎంహెచ్‌వో, కాకినాడ  

మరిన్ని వార్తలు