విజయ కాగడాకు ఘన స్వాగతం..

5 Sep, 2021 09:25 IST|Sakshi
విజయ కాగడాను అందుకుంటున్న ప్రిన్సిపాల్‌ అరుణ్‌ ఎం.కులకర్ణి, నేవీ అధికారులు, పక్కన కలెక్టర్‌ సూర్యకుమారి

సాక్షి,విజయనగరం రూరల్‌: విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో స్వర్ణిమ్‌ విజయ్‌ వర్ష్‌ వేడుకలు శనివారం అట్టహాసంగా సాగాయి. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్‌ 16 నుంచి విజయ్‌ వర్ష్‌ వేడుకలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోకి ప్రవేశించిన విజయ కాగడా (విక్టరీ టార్చ్‌)కు కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ వద్ద కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, స్కూల్‌ ప్రిన్సిపాల్, కల్నల్‌ అరుణ్‌ ఎం.కులకర్ణి, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. తూర్పు నావికాదళ అధికారులు కాగడాను ప్రిన్సిపాల్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ అరుణ్‌ ఎం.కులకర్ణి మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికుల సేవలు వెలకట్టలేనివన్నారు. నాటి కథనరంగంలో విరోచితంగా పోరాడి విజయాన్ని సాధించిపెట్టిన సైనికులు, అమరవీరుల సేవలు ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. అప్పటి యుద్ధంలో అమరులైన అమరవీరుల గ్రామాలను పునీతంచేస్తూ తిరిగి ఈ ఏడాది డిసెంబర్‌ 16 నాటికి విజయ కాగడా ఢిల్లీకి చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం యుద్ధ వీరులు, వీరనారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సైనిక్‌ స్కూల్‌ పరిపాలనాధికారి అమిత్‌ బాలేరావు, తూర్పు నావికాదళ అధికారులు, పాఠశాల పూర్వ విద్యార్థులు, పాఠశాల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Taliban-India: భారత్‌ ఆందోళనలపై తాలిబన్లు సానుకూలం!

మరిన్ని వార్తలు