ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటం శుభసూచకం

14 Apr, 2021 03:57 IST|Sakshi
గంటల పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్న స్వామీజీలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిర్విరామంగా సంక్షేమ పథకాలు అందుతాయి

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి

పీఠంలో ఉగాది ఆస్థానం.. గంటల పంచాంగం ఆవిష్కరణ

పెందుర్తి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్, కేసీఆర్‌ జాతకాలు బాగుండటం వల్ల ఆయా రాష్ట్రాల ప్రజలకు ప్లవనామ సంవత్సరంలో మేలు జరుగుతుందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాబోయే రోజుల్లో నిరంతరాయంగా సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠంలో ఉగాదిని పురస్కరించుకుని ఉగాది ఆస్థానం నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేసూ్త.. సేనాధిపతి కుజుడు కావడంతో ఈ ఏడాది దేశంలో యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పారు. చాలా పెద్ద నాయకుడికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

ఆర్థికంగా తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందులు ఉండవని.. ప్రజలకు అంతా మంచే జరుగుతుందని వివరించారు. నేతల మధ్య ఏర్పడే సమన్వయ లోపం కారణంగా విభేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదన్నారు. దేశానికి ఇది మంచిది కాదన్నారు. దేశంలో కుట్ర పూరిత యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు. కుటుంబాల మధ్య కూడా అనిశ్చితి ఏర్పడుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. శ్రీప్లవనామ సంవత్సరంలో చతుగ్రహ కూటమి తరచూ ఏర్పడుతుందని దీనివలన కాలసర్ప దోషాలు సంభవిస్తాయని.. ఈ పరిణామాల వలన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా కొన్ని విపత్కర పరిస్థితులు చూడాల్సి వస్తుందన్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత భయంకరంగా ఉంటుందని, వర్షాలు బాగా పడి పంటలు పండుతాయని చెప్పారు.

మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పారు. కరోనా మహమ్మారి జూలై వరకు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందని..ఆ తర్వాత ఎంతవరకు ప్రబలుతుందో ఆ తర్వాత గానీ నిర్ణయించలేమని స్పష్టం చేశారు. ప్రజలు తిరుమల శ్రీవారిని, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్నస్వామి, బెజవాడ కనకదుర్గమ్మను, యాదాద్రి నరసింహస్వామిని, వేములవాడ రాజరాజేశ్వరస్వామిని, బాసర సరస్వతీదేవిని కొలవాలని సూచించారు. స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ ప్లవ అంటే వెలుగునిచ్చేదని అని అర్థాన్ని వివరించారు. వికారి, శార్వరి నామ సంవత్సరాల్లో కమ్ముకున్న చీకట్లను తొలగించి ప్లవ నామ నూతన సంవత్సరం వెలుగులివ్వాలని కోరుతూ అంతా రాజశ్యామల అమ్మవారిని ప్రార్థించాలని అన్నారు.

గంటల పంచాంగం ఆవిష్కరణ
పీఠంలో ఉగాది వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పఠనంతో ఉగాది ఆస్థానం ప్రారంభమైంది. స్వామీజీల చేతుల మీదుగా శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. స్వర్ణ కవచధారిణిగా దర్శనమిచ్చిన అమ్మవారు విశేష అర్చనలు అందుకున్నారు. పీఠాధిపతి, ఉత్తరాధికారి చేతుల మీదుగా గంటల పంచాంగం ఆవిష్కరణ జరిగింది. పీఠం ఆస్థాన సిద్ధాంతి పంతుల రామలింగ స్వామి పంచాంగ శ్రవణం వినిపించారు. భక్తులకు స్వామీజీ చేతుల మీదుగా ఉగాది పచ్చడి ప్రసాదం వితరణ చేశారు.  

మరిన్ని వార్తలు