ఏపీ విద్యా వ్యవస్థ భేష్‌.. స్విట్జర్లాండ్‌ మాజీ అధ్యక్షుడు ప్రశంసలు  

18 Feb, 2023 08:26 IST|Sakshi

కరోనాతో చాలా దేశాల విద్యా వ్యవస్థలకు పెను సవాళ్లు

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా అద్భుత ప్రగతి

అందుకు సీఎం వైఎస్‌ జగన్‌ విధానాలే దోహదం

నాడు–నేడు, డిజిటల్‌ బోధనతో మంచి ఫలితాలు

భవిష్యత్‌లో ఏపీ విద్యార్థులు అంతర్జాతీయంగా రాణింపు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, ప్రత్యేకించి విద్యా వ్యవస్థ అద్భుతమని స్విట్జర్లాండ్‌ మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్‌ కొనియాడారు. జెనీవా నగరంలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఫోరం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విద్యా వ్యవస్థ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. అయితే ఇండియాలోని ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఆ రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయని కొనియాడారు.

నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేశారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నేలా ఉన్నాయన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చుతోందని, ఇది గర్వించదగ్గ విషయం అని అన్నారు. కొంత కాలం తర్వాత ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా నిలుస్తారని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అందరి వల్లా కాదని, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి ఉన్న వారికే సాధ్యమవుతుందని చెప్పారు.

ఆకట్టుకున్న ఏపీ స్టాల్‌  
ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పథకాల స్టాల్‌ పలువురిని ఆకట్టుకుంది. స్వయంగా దేశాధ్యక్షుడే ఏపీ విద్యా విధానాలపై ప్రశంసలు వ్యక్తం చేయడంతో స్విట్జర్లాండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ పాట్రిసియా దన్జీ స్టాల్‌ను సందర్శించారు. ప్రభుత్వ పథకాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ఎడ్యుకేషన్‌ కోసం నాడు–నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలవుతున్న తీరు, విద్యా ప్రమాణాలు మెరుగుదల.. తదితర విషయాలపై ఆయన ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు.

డిజిటల్‌ లెర్నింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌ల పంపిణీ, పాఠశాలల ఆధునికీకరణ, డిజిటల్‌ బోర్డుల ఏర్పాటు, ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన తదితర కార్యక్రమాలన్నీ పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో న్యూట్రిషన్‌ ఫుడ్‌ అందించడం మంచి పరిణామం అన్నారు.
చదవండి: టీడీపీకి పుట్టగతులుండవని ‘ఈనాడు’ భయం

లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజెనిక్‌ బాత్రూమ్స్‌ అండ్‌ టాయిలెట్స్, యూనిఫాం, స్టేషనరీ కిట్స్, బుక్స్‌ అందిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ‘ఈక్విటబుల్‌ ఎడ్యుకేషన్‌ యాక్సెస్‌ టు ఆల్‌’ విధానం చాలా నచ్చిందన్నారు. ఏపీ స్టాల్‌ను ఇంటర్నేషనల్‌ యూనిసెఫ్‌ ప్రోగ్రామ్స్‌ స్పెషలిస్ట్‌ అతెనా లౌబాచెర్‌ సందర్శించారు. గరŠల్స్‌ ఎడ్యుకేషన్‌ విధానంతో అసమానతలను రూపుమాపవచ్చని అభినందించారు. డిజిటల్‌ ఎడ్యుకేషన్లో భాగంగా బైజూస్‌ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో గొప్పగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇండియా నుండి ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యుడు వున్నవ షకిన్‌ కుమార్‌ పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు