చిన్నారి ఉసురు తీసింది.. కుక్కలు, కోతులా? హత్యా?

16 Mar, 2021 08:59 IST|Sakshi
కన్నీరుమున్నీరవుతున్న బాలుడి తల్లి, బంధువులు (ఇన్‌సెట్‌లో) భార్గవ తేజ (ఫైల్‌) 

 ఇంటికి 200 మీటర్ల దూరంలో కందకంలో మృతదేహం

సాక్షి, తాడేపల్లి ‌(మంగళగిరి): తాడేపల్లి మండల పరిధిలోని మెల్లెంపూడి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అదృశ్యమైన బాలుడు తమ ఇంటికి 200 మీటర్ల దూరంలో పంట పొలాల్లో ఉన్న కందకంలో మృతి చెందినట్లు స్థానికులు సోమవారం సాయంత్రం 5.30 గంటలకు గుర్తించారు. ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం... మెల్లెంపూడి ఎస్టీ కాలనీలో నివాసం ఉండే కుర్ర భగవానియా నాయక్, అమల దంపతుల రెండో కుమారుడు భార్గవ తేజ (6). ఆదివారం సాయంత్రం నుంచి తమ కుమారుడు కనిపించడం లేదంటూ తండ్రి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అనంతరం సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాలుడి ఇంటి పక్కనే నివాసం ఉండే నాగేశ్వరరావు అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లగా కందకంలో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కందకంలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. బహుశా కుక్కలు కానీ, కోతులు కానీ వెంటపడటంతో కందకంలో పడి ఉంటాడని, అక్కడ బాలుడిని అవి గాయపరిచి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

ఘటనపై అనుమానాలు 
ఈ ఘటనపై కుటుంబసభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే బాలుడిని దారుణంగా కొట్టి చంపి ఉంటారని పేర్కొంటున్నారు. ఇంటికి 200 మీటర్ల దూరంలో కుక్కలు గాని, కోతులు గాని దాడి చేస్తే తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అవే దాడిచేసి ఉంటే కుడి కాలు విరిగి, ఎముక బయటకు వచ్చేంత పరిస్థితి ఉంటుందా? చెయ్యి ఎందుకు విరుగుతుంది? కందకంలో పడినంత మాత్రాన అంత పెద్ద దెబ్బలు తగులుతాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నార్త్‌జోన్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్, తాడేపల్లి రూరల్‌ సీఐ అంకమ్మరావు, ఎస్సై వినోద్‌కుమార్‌ ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. గుంటూరు నుంచి డాగ్‌ స్క్వాడ్‌ను, వేలిముద్రల నిపుణులను పిలిపించి దర్యాప్తు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు.  

రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా?  
మండల పరిధిలోని వడ్డేశ్వరంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న అదృశ్యమైన బండి అఖిల్‌ (8), మెల్లెంపూడిలో మృతిచెందిన భార్గవతేజ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండు కుటుంబాల్లో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. అందులో ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. వడ్డేశ్వరం బాలుడి తల్లి, మెల్లెంపూడి బాలుడి తండ్రి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు యూనివర్సిటీలో కలిసి పనిచేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రెండు ఘటనలూ ఒకే విధంగా ఉండటంతో ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.  

చదవండి: సెల్‌ఫోన్‌ వాడొద్దన్నందుకు.. మనస్తాపంతో!
పీహెచ్‌డీ చేసి.. కళ్లు కాంపౌండ్‌లో‌ ‘మత్తు’

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు