రేయ్‌...రూ.2 వేలు తీసుకుని ఓటేశారు: జేసీ

5 Apr, 2021 03:50 IST|Sakshi
ఆంజనేయస్వామి మాన్యంలో ప్రజలను దూషిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

డబ్బు తీసుకుని ఓట్లేశారు.. 

పనులు చేయమని అడుగుతారా? అంటూ ఆగ్రహం 

తాడిపత్రి: ‘‘రేయ్‌...ఎలక్షన్‌లో ఓటుకు రూ.2 వేలు తీసుకుని నాకు ఓటేశారు.. ఇప్పుడు పనులు చేయమని అడుగుతారా! నా... డకల్లారా.. పనులు చేయమని నన్ను అడిగే హక్కు మీకు లేదు’’ అని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రజలపై చిందులు తొక్కారు. తాడిపత్రి పట్టణంలోని 35వ వార్డు ఆంజనేయస్వామి మాన్యంలో ఆదివారం మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు తమకు రోడ్లు లేవని, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని మున్సిపల్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన అక్కడున్న వారిపై ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘మీరు డబ్బు తీసుకోకుండా ఓట్లేసి ఉంటే.... నేను మీకు పనులు చేసిపెట్టాలి. డబ్బు తీసుకుని ఓట్లేశారు.. మీకు నన్ను అడిగే హక్కులేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహిళల ఎదుటే అక్కడున్న పురుషులను బూతులు తిడుతూ దుర్భాషలాడారు. దీంతో అక్కడున్న వారంతా బిత్తరపోయారు. ఎన్నికల ముందు ‘సేవ్‌ తాడిపత్రి’ పేరుతో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారం దక్కగానే ఇలా నోటికి పనిచెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు.  

మరిన్ని వార్తలు