భూమికి ట్యాగ్‌లైన్‌, లోగోలతో భరోసా!

26 Oct, 2020 19:25 IST|Sakshi

దేశంలో ఎక్కడా లేని విధంగా రీసర్వే యజ్ఞానికి శ్రీకారం

ప్రతి విభాగంలో పేర్లు ప్రతిపాదించిన అధికారులు 

ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు త్వరలో ఖరారు

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూములను సంపూర్ణంగా సర్వే చేసి యజమానులకు వాటిపై శాశ్వత హక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన బృహత్తర కార్యక్రమానికి మంచి పేరు, ట్యాగ్‌లైన్, లోగో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సర్వే నంబరుకు కచ్చితమైన హద్దుల నిర్దారణ, రైతులకు శాశ్వతహక్కుల కల్పన లక్ష్యాలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భూముల సమగ్ర రీసర్వే, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు అమలు చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకుని ముందుకెళుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా  రాష్ట్ర ప్రభుత్వం ఇలా రీసర్వే యజ్ఞానికి శ్రీకారం చుడుతుండటం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వందేళ్ల తర్వాత చేపడుతున్న అతి పెద్ద సాహసోపేత కార్యక్రమం అయినందున ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా ప్రజలకు దీని ఆవశ్యకతపై విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ప్రతిపాదిత పేర్లు ఇవే...
ఈ బృహత్తర కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా కొన్ని పేర్లను ప్రతిపాదించారు. ‘స్వక్షేత్ర’, ‘క్షేత్రఘ్న’, ‘స్వధాత్రి’, ‘స్వభూమి’, ‘వసుంధర’, ‘వసుధ’, ‘క్షేత్రపతి’, ‘భూమిదారు’ తదితర పేర్లను ప్రాథమికంగా రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. మరికొన్ని పేర్లనూ పరిశీలించి అందులో ఒకదానిని ముఖ్యమంత్రి ఆమోదించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. 

ఏడు ప్రతిపాదనలు
ట్యాగ్‌ లైన్‌ కోసం ఏడు ప్రతిపాదనలను రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించారు. ‘మీ భూమికి మా హామీ’, ‘మీ భూమికి భద్రత’, ‘మీ భూమి పదిలం’, ‘మీ భూమికి శాశ్వత హక్కు‘, ‘ప్రతి క్షేత్రం పదిలం’, ‘మీ భూమికి మా భరోసా’, ‘ప్రతి క్షేత్రం క్షేమం’ అనే అంశాలను ట్యాగ్‌లైన్‌ కోసం ప్రాథమికంగా ప్రతిపాదించారు. 

రైతుపై నయాపైసా భారం ఉండదు
రీ సర్వే కోసం ఎంత ఖర్చయినా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, భూ యజమానులపై నయాపైసా భారం కూడా వేయరాదని సీఎం జగన్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నంబరు రాళ్ల ఖర్చును రైతులే చెల్లించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించినా అది కూడా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

నాడు...
గతంలో భూమి కొలతలు, సబ్‌ డివిజన్‌ చేయించుకోవాలంటే చేతి చమురు వదిలించుకోవాల్సి వచ్చేది. ముందుగా మీసేవ కేంద్రంలో డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాల్సి వచ్చేది. ముడుపులు ఇవ్వనిదే సర్వేయరు వచ్చి భూమి కొలతలు వేయని పరిస్థితి. సర్వేయర్ల కొరతవల్ల  నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. 

నేడు...
వైఎస్‌ జగన్‌ సర్కారు రాగానే 11,500 పైగా గ్రామ సర్వేయర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించింది. ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయరు ఉన్నారు. ఎవరు భూమి కొలతలు వేయించుకోవాలన్నా గ్రామ/ వార్డు సచివాలయంలో అర్జీ ఇస్తే చాలు. వెంటనే సర్వేయరు వచ్చి పని పూర్తి చేస్తారు. ఇప్పటి వరకూ విదేశాలకే పరిమితమైన కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్‌ రెఫరెన్స్‌ స్టేషన్స్‌ (కార్స్‌) అనే అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వే చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

భూసర్వేకు కార్యాచరణ రూపొందించాం
రాష్ట్రంలో 120 ఏళ్ల నుంచి భూముల సర్వే జరగలేదు. దీనివల్ల చాలాచోట్ల సరిహద్దు రాళ్లు లేవు. పెద్ద సంఖ్యలో పొలంగట్ల వివాదాలు ఉన్నాయి. రికార్డులు సక్రమంగా లేనందున రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందువల్లే రికార్డులను స్వచ్ఛీకరించి ట్యాంపర్డ్‌ ఫ్రూఫ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి  నిర్ణయించారు. ఆయన మార్గనిర్దేశం ప్రకారం భూ సర్వేకి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. 
                              - వి. ఉషారాణి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు