వినయ విధేయ తహసీల్దార్‌

3 Aug, 2020 13:32 IST|Sakshi

చుక్కల భూములకు పట్టాలు తహసీల్దార్‌ నిర్వాకం    

కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ప్రసన్న

విడవలూరు: ఆయనొక తహసీల్దార్‌. పేదలకు అండగా నిలవాల్సిన వ్యక్తి పెద్దలకు వినయ, విధేయుడిగా మారాడు. అక్రమ సొమ్ముపై ఆశతో సెలవు దినాల్లో కూడా చుక్కల భూములకు పట్టాలు చేస్తున్నారు.     

విడవలూరు మండలంలో తీర ప్రాంతమైన ఊటుకూరు పంచాయతీ పరిధిలోని పల్లిపాళెం గ్రామంలో ప్రస్తుతం ఆక్వా గుంతల భూముల్లో సర్వే నంబర్లు 942–1, 942–2, 1300, 1398, 1399లలో దాదాపు 14.5 ఎకరాల చుక్కలు భూములు ఉన్నాయి. వీటికి రికార్డులు తారుమారు చేసి పట్టాలను సృష్టించేందుకు కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన టీడీపీ నాయకులతో తహసీల్దార్‌ నౌషాద్‌ అహ్మద్‌ చేతులు కలిపాడని ఆరోపణలున్నాయి.
ముదివర్తిలో ఉన్న 2.5 ఎకరాలు, పల్లిపాళెం వద్ద ఉన్న మరో నాలుగు ఎకరాలకు కూడా రికార్డులు తారుమారు చేసి పట్టాలను ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తహసీల్దార్‌కు భారీ మొత్తంలో నగదు అందినట్లు సమాచారం. 
ఈ పనులకు తహసీల్దార్‌ నౌషాద్‌ అహ్మద్‌ సెలవు రోజు శనివారం మధ్యాహ్నం కార్యాలయానికి చేరుకున్నాడు. తన కారులో వస్తే స్థానికులకు అనుమానం వస్తుందని పడుగుపాడుకు చెందిన వ్యక్తి కారులో కార్యాలయానికి చేరుకున్నారు.  
తహసీల్దార్‌తో పాటు మరికొందరు రెవెన్యూ అధికారులను కూడా కార్యాలయానికి పిలిపించుకుని గుట్టు చప్పుడు కాకుండా పని ముగించే ప్రయత్నం చేశారు.  
విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు సెలవు దినాల్లో కూడా తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కార్లు ఉండటాన్ని గమనించి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయట పడింది. 
చుక్కల భూములకు పట్టాలు సృష్టించేందుకు తహసీల్దార్‌ ప్రయత్నించడం ప్రభుత్వాన్నే మోసం చేయడమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 
కలెక్టర్‌కు ఫిర్యాదు 
ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి స్థానంలో ఉన్న తహసీల్దార్‌ ఇలా చుక్కల భూములకు పట్టాలను పుట్టించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు.  

మరిన్ని వార్తలు