వెలుగుచూస్తున్న తహసీల్దార్‌ అక్రమాలు

5 Aug, 2020 13:33 IST|Sakshi

ప్రభుత్వ విలువ తక్కువ ఉన్న చోట ఎక్కువ 

ఎక్కువ ఉన్న చోట తక్కువగా ప్రతిపాదనలు 

విడవలూరు: ఇటీవల విడవలూరు మండలంలోని తీర ప్రాంతంలో ఉన్న చుక్కల భూములకు పట్టాలు పుట్టించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విడవలూరు తహసీల్దార్‌ లీలలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. వివరాలు.. ఇటీవల అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు పట్టా భూములను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. అందులో భాగంగా మండల కేంద్రమైన విడవలూరులో 10 ఎకరాలను గుర్తించారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎకరా రూ.20 లక్షలు ఉన్నట్లు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. అలాగే రామతీర్థంలో మూడున్నర ఎకరాలను కూడా గుర్తించారు. ఇక్కడ ప్రభుత్వ విలువ అతి తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కూడా ఎకరా రూ.20 లక్షలుగా ప్రతిపాదనలు పంపారు.

దీంతోపాటు ముదివర్తి గ్రామంలో కూడా 6 ఎకరాలను గుర్తించారు. ఇక్కడ కూడా ప్రభుత్వ విలువ తక్కువగా ఉన్నప్పటికీ ఎకరా రూ.23 లక్షలుగా ఉందని ప్రతిపాదనలు పంపారు. ఇలా ప్రభుత్వ విలువ ఎక్కువగా ఉన్నచోట తక్కువ గానూ, తక్కువగా ఉన్న చోట ఎక్కువ గానూ ప్రతిపాదనలు పంపడంలో ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ముదివర్తి గ్రామానికి చెందిన షేక్‌ మస్తాన్‌ సాహెబ్‌కు సర్వే నంబర్‌ 306–బీ లో 1.17 ఎకరాలు, 306–సీ లో 0.6 ఎకరాలు, 306–డీ1లో 0.22 ఎకరాల భూమి(మొత్తం 1.45 ఎకరాలు) ఉంది. ఇందుకు సంబంధించిన ఈ–పాస్‌ బుక్‌ కూడా సంబంధిత రైతు వద్ద ఉంది. అయితే గత నెల 8వ తేదీన ఈ రైతు పేరుతో కేవలం 0.39 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపుతున్నారు. దీనిని తహసీల్దార్‌ మార్చి వేశారని బాధిత రైతు ఆరోపిస్తున్నాడు. తన మిగిలిన పొలాన్ని ప్రస్తుతం ఇళ్ల స్థలాలకు గుర్తించిన వాటిలో కలిపి ఎక్కువ పొలంగా చూపి మోసం చేసేందుకు తహసీల్దార్‌ సిద్ధమైనట్లు బాధిత రైతు వాపోయాడు. 

న్యాయం చేయండి 
నాకున్న 1.45 ఎకరాల భూమిలో దాదాపు 1.06 ఎకరాల భూమిని మరో రైతు పేరు మీదకు మార్చారు. ఇది కూడా గత నెల 8వ తేదీన జరిగింది. నా పొలాన్ని ప్రస్తుతం ఇళ్ల స్థలాల కోసం గుర్తించి, ఎక్కువ భూమిగా చూపి తహసీల్దార్‌ మోసం చేయడానికి సిద్ధపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి. – షేక్‌ మస్తాన్‌సాహెబ్‌  

మరిన్ని వార్తలు