తాడిపూడి అబ్బాయికి తైవాన్‌ అమ్మాయితో పెళ్లి

5 May, 2022 15:56 IST|Sakshi
వధూవరులు చెల్సీ, రంగబాబుతో కుటుంబ సభ్యులు

సాక్షి, తాళ్లపూడి: దేశాలు వేరైనా వారిని వివాహ బంధం ఒక్కటి చేసింది.. ప్రేమ వారిని కలిపింది.. తాడిపూడి అబ్బాయికి తైవాన్‌ అమ్మాయితో వివాహం జరిగింది. భారతీయ వివాహ వ్యవస్థకు ఎల్లలు లేవని చాటి చెప్పింది. తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు గంటా సూర్యచంద్రం కుమారుడు రంగబాబు ఐఐటీ చదివి తైవాన్‌ టీఎస్‌ఎంసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో పనిచేస్తున్న తైవాన్‌ అమ్మాయి చెల్సీతో ప్రేమలో పడ్డాడు.

ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించడంతో పెళ్లి నిశ్చయించారు. బుధవారం బల్లిపాడులోని ఫంక్షన్‌ హాలులో క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తైవాన్‌ అమ్మాయి చెల్సీ చీర కట్టులో ఆకట్టుకున్నారు. దీవించడానికి వచ్చిన పెద్దలకు ఆమె రెండు చేతులతో నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. మన సంప్రదాయం అంటే తనకు ఎనలేని గౌరవమని ఆమె పేర్కొన్నారు. మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గంటా కృష్ణ, పలువురు సర్పంచులు, ఆయా పార్టీల నాయకులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

చదవండి: (దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక) 

మరిన్ని వార్తలు