రాష్ట్రానికి ఆదర్శం.. తక్కెళ్లపాడు

21 Dec, 2020 11:16 IST|Sakshi
తక్కెళ్లపాడులో ఇటీవల రీసర్వే చేస్తున్న సిబ్బంది

తక్కెళ్లపాడు ప్రాతిపదికగానే రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే

తక్కెళ్లపాడులో రీసర్వే పైలట్‌ ప్రాజెక్టు

డ్రోన్లను ఉపయోగించి రీసర్వేకు శ్రీకారం

సాక్షి, మచిలీపట్నం: తక్కెళ్లపాడు.. వందేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే పైలట్‌ ప్రాజెక్టుగా చేసిన ఈ గ్రామం రాష్ట్రవ్యాప్త రీసర్వేకి ఆదర్శంగా నిలిచింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో దేశంలోనే తొలిసారిగా కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిసీవింగ్‌ స్టేషన్‌ (కోర్స్‌) నెట్‌వర్క్‌ ద్వారా డ్రోన్లను ఉపయోగించి రీసర్వేకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 11 ప్రత్యేక బృందాలు 31 రోజులపాటు శ్రమించాయి.

సర్వే ఎలా చేశారంటే..
రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్ని అప్‌డేట్‌ చేసి తొలుత గ్రామ సరిహద్దుల గుర్తింపు చేపట్టారు. గల్లంతైన 102 సరిహద్దురాళ్లు వేశారు. రెండోదశలో 86 సర్వే నంబర్లలో ఉన్న 272.52 ఎకరాల ప్రభుత్వ భూములను, మూడోదశలో 221 సర్వే నంబర్లలో ఉన్న 1,266.45 ఎకరాల ప్రైవేటు భూములను సర్వేచేసి హద్దులు గుర్తించారు. చివరగా గ్రామంలో ఉన్న ఆలయాలు, ప్రభుత్వ భవనాలు, ఇళ్లు, ప్రైవేటు ఆస్తులు సర్వే చేశారు. గుర్తించిన వ్యత్యాసాలకు సంబంధించిన 9 (2) నోటీసులపై 147 అప్పీళ్లు వచ్చాయి. వీటిలో 112 అప్పీళ్లను పరిష్కరించారు. మిగిలిన కేసులను పరిష్కరించి 10వ తేదీన ఫైనల్‌ పబ్లికేషన్‌ జారీచేశారు. కొత్తగా రూపొందించిన గ్రామ మ్యాప్, ఎఫ్‌ఎంబీ, ఆర్‌ఎస్‌ఆర్, అడంగల్, ఐబీ, ప్రభుత్వ భూముల రిజిష్టర్లను నేడు (సోమవారం) ప్రకటిస్తారు. భూ యజమానులకు కొత్త పాస్‌పుస్తకాలు జారీచేస్తారు. కొత్త సర్వే రాళ్లు పాతుతారు.

గుర్తించిన వ్యత్యాసాలు
ఎఫ్‌ఎంబీ ప్రకారం 6.04 శాతం, అడంగల్‌ ప్రకారం 11.25 శాతం వ్యత్యాసం ఉన్నట్లుగా గుర్తించారు. సబ్‌ డివిజన్ల ప్రకారం అత్యధికంగా 2.10 ఎకరాలు, అత్యల్పంగా 0.01 ఎకరాలు,  అడంగల్‌ ప్రకారం అత్యధికంగా 3.73 ఎకరాలు, అత్యల్పంగా 0.01 సెంట్ల తేడా ఉన్నట్లు నిర్ధారించారు. పాత ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం సర్వే నంబరు 97లో 1.46 ఎకరాలు ఎక్కువ, సర్వే నంబరు 125లో 0.80 ఎకరాలు తక్కువ ఉన్నట్టుగా గుర్తించారు. అడంగల్‌ ప్రకారం 3.73 ఎకరాలు తక్కువగా నమోదైనట్టుగా లెక్క తేల్చారు. (చదవండి: జనం ఆస్తికి అధికారిక ముద్ర)

మరిన్ని వార్తలు