చెన్నైకి నీటి సరఫరా భేష్‌

24 Dec, 2021 04:09 IST|Sakshi

ఏపీ సర్కార్‌కు తమిళనాడు ప్రశంసలు

గతేడాది రికార్డు స్థాయిలో 8.23 టీఎంసీలు చెన్నైకి సరఫరా

ఈ ఏడాది ఇప్పటికే 5.5 టీఎంసీలు సరఫరా చేసినట్లు కృష్ణా బోర్డుకు వివరించిన తమిళనాడు

ఏప్రిల్‌ వరకూ నీటిని సరఫరా చేయొద్దని ఏపీని కోరినట్లు వెల్లడి

కోటా మేరకు నీటిని సరఫరా చేయలేని ఏపీ సర్కార్‌పై జరిమానా విధించాలన్న తెలంగాణ అధికారులు

తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ.. ఒప్పందంలో జరిమానా నిబంధన లేదని స్పష్టీకరణ

కృష్ణా బోర్డుకి చెప్పే.. సముద్రంలో వృథాగా కలుస్తున్న వరద జలాలను మళ్లిస్తున్నామని ఏపీ స్పష్టీకరణ

చెన్నైకి మరింత మెరుగ్గా నీటి సరఫరాపై అధ్యయనానికి సాంకేతిక కమిటీ ఏర్పాటు

సాక్షి, అమరావతి: చెన్నైకి నీటి సరఫరా విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని తమిళనాడు సర్కారు ప్రశంసించింది. చెన్నైకి ఏపీ పూర్తిస్థాయిలో నీరు సరఫరా చేస్తోందని కృష్ణా బోర్డుకు తెలిపింది. చెన్నైకి నీటి సరఫరాపై మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జలవనరుల అధికారులతో గురువారం కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ వర్చువల్‌ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలుగుగంగ చరిత్రలో తొలిసారిగా చెన్నైకి గత ఏడాది (2020లో) గరిష్టంగా 8.23 టీఎంసీలు ఏపీ సరఫరా చేసిందని తమిళనాడు అధికారులు చెప్పారు.

ఈ ఏడాది ఇప్పటికే 5.5 టీఎంసీలు సరఫరా చేసిందని, పూండి జలాశయం నిండిపోవడంతో ఏప్రిల్‌ వరకు సరఫరా చేయొద్దని ఏపీని కోరినట్లు చెప్పారు. అయితే, ఒప్పందానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చెన్నైకి తక్కువ నీటిని సరఫరా చేస్తోందని, ఏపీకి జరిమానా విధించాలని తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్‌కుమార్‌ అన్నారు. దీనికి కర్నూలు ప్రాజెక్టస్‌ సీఈ మురళీనాథ్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య 1976లో కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందంలో, 1983లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య కుదిరిన ఒప్పందంలో జరిమానా నిబంధన లేదని స్పష్టం చేశారు. నీటి సరఫరాపై తమిళనాడు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. తెలంగాణ అధికారులకు ఎందుకు ఇబ్బంది అని నిలదీశారు.

చెన్నైకి నీటి సరఫరా పేరుతో ఏపీ వందలాది టీఎంసీలను పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి మళ్లిస్తోందని తెలంగాణ అధికారులు చేసిన వ్యాఖ్యలను మురళీనాథ్‌రెడ్డి తోసిపుచ్చారు. కృష్ణా వరద జలాల మళ్లింపు అంశం తెలుగుగంగ ప్రాజెక్టు నివేదికలో ఉందని,  కృష్ణా బోర్డుకు చెప్పే వృథాగా సముద్రంలో కలుస్తున్న వరదను మళ్లిస్తున్నామని స్పష్టం చేశారు. దాంతో.. రాజోలిబండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్‌)కు నీటిని సక్రమంగా సరఫరా చేయడం లేదని తెలంగాణ సీఈ అనగా.. బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. చెన్నైకి మరింత మెరుగ్గా నీటి సరఫరా చేయడంపై అధ్యయనం బాధ్యతలను ఏపీ, తమిళనాడు ఈఎన్‌సీల నేతృత్వంలోని సాంకేతిక కమిటీకి అప్పగిస్తున్నామని చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

30 నుంచి 40 రోజుల్లేనే 12 టీఎంసీలు..
చెన్నైకి కేటాయించిన 15 టీఎంసీల్లో.. ఆవిరి, ప్రవాహ నష్టాలుపోనూ శ్రీశైలం నుంచి తమిళనాడు సరిహద్దుకు జూలై నుంచి అక్టోబర్‌ వరకూ 8, జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ 4 టీఎంసీలను ఏపీ సరఫరా చేయాలి. అప్పట్లో శ్రీశైలానికి వరద జూలైలోనే వచ్చేదని, ఇప్పుడు ఆగస్టులో వస్తోందని, వరద ఒకేసారి గరిష్టంగా రావడం వల్ల శ్రీశైలం నిండిపోయి సాగర్, ప్రకాశం బ్యారేజీ మీదుగా జలాలు సముద్రంలో కలుస్తున్నాయని ఏపీ సీఈ చెప్పారు. వరదను ఒడిసి పట్టి సోమశిల, కండలేరులో నిల్వ చేసిన నీరు సాగుకే సరిపోవడం లేదన్నారు.

శ్రీశైలంలో 840 అడుగులకు పైన నీటి నిల్వ 100 రోజులు కూడా ఉండటం లేదన్నారు. వరద రోజులు ముగిశాక.. మహారాష్ట్ర, కర్ణాటకలు కేటాయించిన చెరో ఐదు టీఎంసీలను కూడా రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తే తప్ప తమిళనాడుకు జూలై నుంచి అక్టోబర్, ఏప్రిల్‌ నుంచి జనవరి మధ్య 12 టీఎంసీలు సరఫరా చేయలేమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో చెన్నైకి 250 రోజుల్లో కాకుండా 30 నుంచి 40 రోజుల్లోనే 12 టీఎంసీలు సరఫరా చేస్తామన్నారు. ఆ మేరకు ఏపీ సరిహద్దు నుంచి పూండి రిజర్వాయర్‌ వరకు కాలువ సామర్థ్యాన్ని వెయ్యి నుంచి 2,500 క్యూసెక్కులకు, రిజర్వాయర్ల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలని ప్రతిపాదించారు.

ఎగువ రాష్ట్రాలు విడుదల చేసిన కోటా నీటిని శ్రీశైలం నుంచి తరలించడానికి చెన్నై వరకూ పైపులైన్‌ వేసుకోవాలని సూచించారు.  చెన్నైకి నీటిని సరఫరా చేసినందుకు తమిళనాడు ఇంకా రూ.350 కోట్లకుపైగా బకాయి పడిందని, ఆ నిధులు విడుదల చేయాలని ఏపీ సీఈ మురళీనాథ్‌రెడ్డి కోరారు. ఈ విషయాలను తమ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తమిళనాడు అధికారులు చెప్పారు. 

మరిన్ని వార్తలు