ఆర్‌బీకేలు అద్భుతం 

7 Sep, 2022 04:20 IST|Sakshi
ఆర్‌బీకే పనితీరును అడిగి తెలుసుకుంటున్న మురళీధరన్‌

రైతులకు గ్రామస్థాయిలోనే ప్రయోజనం   

ప్రశంసలు కురిపించిన తమిళనాడు వ్యవసాయాధికారుల బృందం 

తిరుపతి జిల్లాలో ఆర్‌బీకేల, పరిశోధనల ల్యాబ్‌ల సందర్శన

తిరుపతి రూరల్‌: రైతులకు గ్రామ స్థాయిలోనే సంపూర్ణ సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు అద్భుతమని తమిళనాడుకు చెందిన వ్యవయసాయాధికారుల బృందం ప్రశంసలు కురిపించింది. ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. తమిళనాడుకు చెందిన సీనియర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మురళీధరన్‌ ఆధ్వర్యంలో 35 మంది డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, వ్యవసాయాధికారుల బృందం ప్రత్యేక బస్సులో మంగళవారం తిరుపతి రూరల్‌ మండలం తనపల్లిలోని రైతు భరోసా కేంద్రం(ఆర్‌బీకే), చంద్రగిరిలోని నియోజకవర్గ వ్యవసాయ పరిశోధన ల్యాబ్‌ను సందర్శించింది.

ఆర్‌బీకేలో అందిస్తున్న సేవలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం ఉపయోగించే డిజిటల్‌ కియోస్క్‌ల ఉపయోగాలను పరిశీలించింది. వారికి వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రసాదరావు, ఏడీ సుబ్రమణ్యంలు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా  మురళీధరన్‌ మాట్లాడుతూ ఒకే గొడుగు కింద రైతులకు అన్ని రకాల సేవలను అందించడంలో ఆర్‌బీకేలు అక్షయ పాత్రలుగా పనిచేస్తున్నాయని కొనియాడారు.

అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నదాతలకు విప్లవాత్మక సేవలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ముఖ్యంగా ఆర్‌బీకే స్థాయిలోనే ప్రతి నెలా వ్యవసాయ సలహా కమిటీ సమావేశాలు నిర్వహించి, రైతులకు సంబంధించి సమగ్రంగా చర్చించుకునే విధానం అనుసరణీయమన్నారు. ఏపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ పరిశోధన ల్యాబ్‌ల వల్ల కలిగే ప్రయోజనాలపై తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు మురళీధరన్‌ వెల్లడించారు.    

>
మరిన్ని వార్తలు