టూరిస్ట్‌ పోలీసు స్టేషన్లను అందుకే ఏర్పాటు చేశాము: తానేటి వనిత

14 Feb, 2023 14:29 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : పర్యాటకుల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 ​టూరిస్ట్ పోలీసు స్టేషన్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ నేపథ్యంలో హోం మంత్రి తానేటి వనిత టూరిస్టు పోలీసు స్టేషన్ల ప్రారంభంపై ‍స్పందించారు. ఈ క్రమంలో తానేటి వనతి మాట్లాడుతూ.. పోలీస్‌ శాఖలో టూరిస్ట్‌లకు సహాయం చేయడం కోసం టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటుచేయడం సంతోషకరం. మన రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి టూరిస్ట్‌లు వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మేమున్నామంటూ మనం సహాయం చేయడం కోసం ఈ స్టేషన్లు ఏర్పాటు చేశాం. ఈ స్టేషన్ల ద్వారా అవసరమైన సమాచారం ఇవ్వడం, వాహనాలు అందించడం, అవసరమైతే ఫస్ట్‌ ఎయిడ్‌ చేయడం, ఇంకా ఏమైనా అత్యవసరమైన సహాయం చేయడం కోసం ఇవి ఏర్పాటుచేయడం శుభపరిణామం. 

రాష్ట్రంలో మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకున్నాము. మహిళలపై అఘాయిత్యాలు నివారించేందుకే దిశా యాప్‌ను తీసుకువచ్చాము. మహిళలు సీఎంగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం లేదు. విజయవాడలో మహిళలను వ్యభిచార కూపంలోకి టీడీపీ నేతలే దించారు. రిషితేశ్వరి ఆత్మహత్య  చేసుకుంటే సకాలంలో చర్యలు తీసుకోలేదు. వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే చంద్రబాబు సెటిల్మెంట్‌ చేశాడు’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు