ఏపీలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్ల లక్ష్యం

1 May, 2021 03:50 IST|Sakshi

జల్‌జీవన్‌ మిషన్‌ వార్షిక ప్రణాళిక సమర్పించిన ఆంధ్రప్రదేశ్‌

గత ఏడాదిన్నరలో 14.34 లక్షల కుళాయి కనెక్షన్లను ఇచ్చిన సర్కారు 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలన్నింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆరి్థక సంవత్సరం వార్షిక ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ వార్షిక ప్రణాళికను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్రానికి సమర్పించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.66 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా 47.13 శాతం కుటుంబాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జల్‌జీవన్‌ మిషన్‌ కింద గత ఏడాదిన్నర కాలంలో 14.34 లక్షల కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 13 జిల్లాలు, 17,044 గ్రామాలను ‘హర్‌ ఘర్‌ జల్‌’గా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,217 గ్రామాలను ‘హర్‌ ఘర్‌ జల్‌’ గా ప్రకటించారు.  

ఏపీకి జాతీయ కమిటీ ప్రశంస 
ఆంధ్రప్రదేశ్‌ రూపొందించిన వార్షిక కార్యాచరణ కార్యక్రమాన్ని పరిశీలించిన జాతీయ కమిటీ నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు, షెడ్యూల్‌ కులాలు, తెగల వారు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు, కరవు ప్రాంతాలు, నీరు అవసరమైన ప్రాంతాలు, సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన కిందకి వచ్చే గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించింది. 2020 అక్టోబర్‌ 2వ తేదీన ప్రారంభించిన 100 రోజుల కార్యాచరణ కింద 41,653 పాఠశాలలు, 42,722 అంగన్‌వాడీ కేంద్రాలు, 11,948 గ్రామ పంచాయతీ కార్యాలయాలు, 14,383 ఆరోగ్య కేంద్రాలకు మంచినీటిని పూర్తిగా పైపుల ద్వారా సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని జాతీయ కమిటీ అభినందించింది. 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ మిషన్‌ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ 7,131 గ్రామాల్లో ఏర్పాటుచేసిన నీరు, పారిశుధ్య కమిటీలు మంచినీటి పథకాలు ఎక్కువకాలం సమర్థంగా పనిచేసేలా చూసి నీటిసమస్య పరిష్కారానికి దోహదపడే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన, నిర్వహణ, యాజమాన్య పద్ధతుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.  

54,568 మందికి శిక్షణ 
గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను పటిష్టం చేయడం, సరఫరాను మెరుగు పరచడం, వ్యర్థ జలాలను శుద్ధిచేసి తిరిగి వినియోగించడం వంటి అంశాలకు జల్‌జీవన్‌ మిషన్‌ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం జిల్లా, ఉప జిల్లా స్థాయిలో 408 మంది నిపుణులను నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయించింది. ఇంజనీరింగ్‌ అనుభవం ఉన్న 54,568 మంది సిబ్బంది, వివిధస్థాయిల అధికారులు, గ్రామ కమిటీల సభ్యులు, స్వయంసహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. 18,536 మందికి ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పంపుల నిర్వహణల్లో శిక్షణ ఇచ్చి జల్‌జీవన్‌ మిషన్‌ కింద చేపట్టే నీటి ప్రాజెక్టుల నిర్వహణకు వినియోగించాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో ఐదుగురు మహిళలకు నీటి నాణ్యత పరీక్ష పరికరాల వినియోగంలో శిక్షణ ఇవ్వనున్నారు. నీటి నాణ్యతను పరిశీలించడానికి రాష్ట్రంలో 9 ప్రయోగశాలలుండగా.. సబ్‌ డివిజన్‌ స్థాయిలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గ్రామాల్లో మంచినీటి సరఫరా పరిశీలన, యాజమాన్యం కోసం సెన్సార్‌ ఆధారిత పరికరాలను వినియోగించాలని రాష్ట్రానికి జాతీయ కమిటీ సూచించింది.   

మరిన్ని వార్తలు